Mahaa Daily Exclusive

  పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల పండగ….

Share

పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల పండగ.
* డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
* 42 మంది ఎంపీడీవోలకు డీడీవోలుగా పదోన్నతులు.
* కూటమి ప్రభుత్వంలో 10 వేల మందికి పైగా లబ్ధి.
*వర్షాకాల సీజనల్ వ్యాధులపై ఉన్నతాధికారులతో సమీక్ష.. పారిశుధ్యంపై ప్రత్యేక నిఘా.

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల సందడి నెలకొంది. ఆ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు మరోమారు తీపికబురు అందించారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 42 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించే ఫైలుపై ఆయన పచ్చజెండా ఊపారు. డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ అర్హులైన అధికారుల సీనియారిటీ జాబితాను ఆమోదించడంతో, వీరంతా త్వరలోనే కొత్త హోదాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటివరకు రికార్డు స్థాయిలో సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులకు వివిధ క్యాడర్లలో పదోన్నతులు కల్పించారు. గత పదేళ్ల కాలంలో ఈ శాఖలో ఇంత భారీ ఎత్తున ప్రమోషన్ల ప్రక్రియ జరగడం ఇదే మొదటిసారని సచివాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
**వర్షాకాల ముందస్తు చర్యలపై పవన్ సమీక్ష**
పదోన్నతుల ప్రక్రియతో పాటు రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజారోగ్యం, గ్రామీణ పారిశుధ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజలతో క్షేత్రస్థాయి పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధప్రాతిపదికన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాకాలంలో అక్కడక్కడా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, అలాగే పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీరు కలుషితమై ప్రజలు డయేరియా, డెంగ్యూ వంటి అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రతి గ్రామ పంచాయతీ ప్రజారోగ్య సంరక్షణను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను ముమ్మరం చేయాలని, దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలను తగినంత పరిమాణంలో సిద్ధంగా ఉంచుకొని, తాగునీటి శుద్ధి ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.