Mahaa Daily Exclusive

  ప్రక్షాళనకు ఏడాది పూర్తి…

Share

ప్రక్షాళనకు ఏడాది పూర్తి.
* దేశవ్యాప్తంగా 6 కోట్ల ఓట్లకు గల్లంతు!
*సుప్రీంకోర్టు సమర్థనతో వేగవంతమైన ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ.
* ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంగా ఓటర్ల జాబితా సవరణ.
* ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ముమ్మరంగా మూడో దశ.
హైదరాబాద్, మహా.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – SIR) ప్రక్రియకు ఏడాది పూర్తయింది. దేశవ్యాప్తంగా పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా చేపట్టిన ఈ భారీ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లను తొలగించడంపై ప్రతిపక్షాలకు, ఎన్నికల సంఘానికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అయినప్పటికీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మూడో దశ ప్రక్షాళన ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతోంది.
గత ఏడాది జూన్ 24న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 65 లక్షల ఓట్లను అధికారులు తొలగించారు. అయితే, సరైన పత్రాలు లేవన్న సాకుతో అధికార పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికల సంఘం ఈ చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు, పలువురు సామాజిక కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన ఏకగ్రీవ తీర్పులో ఎన్నికల సంఘం చేపట్టిన రివిజన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఓట్ల తొలగింపు ప్రభావం నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కూడా పడుతోంది. పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల డేటాను సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం చేయడంతో, జాబితాలో పేర్లు గల్లంతైన వారు ప్రభుత్వ లబ్ధికి సైతం దూరమవుతున్నారు.
ఈ భారీ ప్రక్షాళన కార్యక్రమం ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో గుర్తిస్తూ, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దీనిని ఎన్సీఈఆర్టీ (NCERT) సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాల్లో కూడా చేర్చడం విశేషం. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులను ఏరివేయడమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని అందులో స్పష్టంగా వివరించారు. ఇక గత ఏడాది అక్టోబరు 27న ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ సవరణ ప్రారంభమైంది. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను ఏకంగా 10.2 శాతం మేర కుదించారు. ప్రక్షాళనకు ముందు 50.99 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య.. తాజా సవరణలతో 45.81 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 5.18 కోట్లకు పైగా పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో మరణించిన 66,88,000 మంది పేర్లను శాశ్వతంగా తీసేశారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 25.47 లక్షలు, బెంగాల్‌లో 24.16 లక్షల మంది మరణించిన వారి ఓట్లను తొలగించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరో 63.16 లక్షల పేర్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం.
ప్రస్తుతం ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా మూడో దశకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది మే 14న మూడో దశ సవరణ ప్రక్రియను అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ దశలో భాగంగా ఏకంగా 36.73 కోట్ల మంది ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మూడో దశ ప్రక్షాళన ప్రక్రియను పూర్తిగా ముగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.