Mahaa Daily Exclusive

  నేరస్థుడికి కులమేంటి.. తప్పు ఎవరు చేసినా తప్పే!

Share

  • కుల రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.
  • అన్ని వర్గాలను సమానంగా చూడటమే నిజమైన సామాజిక న్యాయం.అమరావతి, మహా.
    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుల రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాదె సాయికృష్ణ వివాదంపై అమరావతిలో స్పందించిన ఆయన, కృష్ణలంకలో జరిగిన గొడవను ప్రస్తావిస్తూ ఒక నేరస్థుడికి కులాన్ని ఎలా అంటగడతారని తీవ్రంగా నిలదీశారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వారు చేసినా అది తప్పే అవుతుందని, ఒకరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్పు అనే విధానం సరికాదని స్పష్టం చేశారు. తనకు సొంతంగా పత్రికలు, టీవీ ఛానళ్లు లేవని, జనసైనికులే తన మీడియా అని పేర్కొన్న పవన్, ఇలాంటి సున్నితమైన, కీలకమైన అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను సమానంగా చూడటమే అసలైన సామాజిక న్యాయమని ఉద్ఘాటించారు.

జగన్ అండ్ కో చేతిలోనే అధికారం ఉండాలా?
కుల సమీకరణాలతో సాధించేది రాజకీయ విజయమే తప్ప, సామాజిక విజయం కాదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. అధికారం ఎప్పుడూ జగన్ అండ్ కో చేతిలోనే ఉండాలా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ప్రతి            చిన్న అంశంలోనూ కులాన్ని, మతాన్ని వాడుకుంటారని ఎద్దేవా చేశారు. వైసీపీలో పనిచేసిన నాయకులు ప్రస్తుతం తమ వేదికపై ఉన్నారని, వారు ఎప్పుడైనా దిగజారి మాట్లాడటం చూశారా అని ప్రశ్నించారు.                            వైసీపీలోని ఇతర నేతలు నోరు తెరిస్తే చాలు అసభ్య పదజాలంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేపథ్యం నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో విలువల గురించి మాట్లాడారని                    ఆయన ప్రశంసించారు.
నాయకుల బాధ్యతలు.. దేశ సేవకే పెద్దపీట
పార్టీలో సుమారు 18 వేల మంది సాధక్‌లను కలవాలన్నది తన లక్ష్యమని పవన్ తెలిపారు. ప్రతి ఊరిలో బాధ్యతలు తీసుకునే నాయకుడు కనీసం రెండు వేల మందికైనా తెలిసి ఉండాలన్నారు. నాయకుల బాధ్యతల          కేటాయింపుపై మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ నాగబాబు ప్రకృతిని సంరక్షిస్తూ జనాలతో మమేకం అవుతారనే ఉద్దేశంతో అరకు పంపించామని, పల్నాడు పరిస్థితులకు బాలినేని కరెక్ట్ అని ఆయనకు అక్కడ బాధ్యతలు                       ఇచ్చామని తెలిపారు. కాకినాడ రాజకీయాలను తట్టుకునేందుకు సామినేని ఉదయభాను సరైన వ్యక్తని ఎంపిక చేశామన్నారు. ఇక మంత్రి కందుల దుర్గేశ్‌ను అమలాపురం పంపినప్పుడు అక్కడ బంధువులు ఎక్కువని,             మొహమాటాలకు పోవాల్సి వస్తుందేమోనని ఆయన అన్నారని, అయినా సరే కష్టపడే వారికే ప్రాధాన్యం దక్కాలనే ఉద్దేశంతోనే బాధ్యతలు ఇచ్చామని పవన్ వివరించారు. పుష్కర కాలంగా జనసైనికులు ఎంతో                           నలిగిపోయారని, అయితే ఎవరైతే దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తారో వారినే తాను ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. తనకు దేశమే ప్రథమమని, కులం అనేది ఒక సామాజిక వాస్తవమని, దానిని తాను మార్చాలనో,                           సరిదిద్దాలనో ప్రయత్నించబోనని కుండబద్దలు కొట్టారు.
గడప దాటితే దేశం.. మానవత్వం గుర్తుకురావాలి
తాను కులాల గురించి మాట్లాడతానని కొందరు అంటుంటారని, కానీ తాను ఎప్పుడూ కులం కార్డుతో రాజకీయాలు చేయనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం, దేశం బాగుండాలని, అన్నింటికీ మించి మానవత్వం             వర్ధిల్లాలన్నదే తన విధానమన్నారు. కులం అనేది ఎప్పుడూ ఇంటి గడప లోపలే ఆగిపోవాలని, గడప దాటాక మన సంస్కృతి, ధర్మాలు కనిపించాలని, మరో పది అడుగులు వేస్తే దేశం, మానవత్వం గుర్తుకు రావాలని             ఆయన హితబోధ చేశారు. కొందరు స్థాయి దిగజారి మాట్లాడేటప్పుడు తాను కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాల్సి వస్తోందని, ఈ సందేశాన్ని జనసైనికులు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు                     కులాల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ అని కాకుండా పిల్లలందరికీ కలిపి ఒకే హాస్టల్ ఉండాలన్నదే తన కల అని చెప్పారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలే కులాల పేరుతో పిల్లలను విడదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం                     చేశారు. ఓట్ల కోసం వెళ్తే దళితులు, కాపులు, బీసీలు అంటూ వీధులుగా విడగొట్టి మాట్లాడతారని, రాజకీయాలు ఇలా నడుస్తాయన్న విషయం తనకు తెలియదని, తనకు కులాల ఐక్యతే అత్యంత ముఖ్యమని ఆయన                 స్పష్టం చేశారు.
ఏకం కావాల్సింది ఓట్ల సమయంలో..
కులం అనే ఐడెంటిటీని తాను మార్చలేనని, లింగమనేని రమేశ్‌కు రాజ్యసభ స్థానం ఇస్తే కొందరు కులం పేరుతో రచ్చ చేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. శివ లాగానే ఆయన పడిన కష్టాన్ని గుర్తించే ఆ బాధ్యతలు               అప్పగించానన్నారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదని, అందుకే కొన్నిసార్లు తాను ఇలాంటి విషయాల్లో బలంగా మాట్లాడుతుంటానని చెప్పారు. వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడ కోసం             తనపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇన్ని బలమైన కులాలు ఉన్నప్పటికీ అధికారంలోకి ఎందుకు రాలేకపోతున్నారో ఆలోచించుకోవాలన్నారు. బీసీల్లో 105 కులాలు ఉన్నాయని, కాపుల్లో బలిజ,                 ఒంటరి వంటి ఎన్నో తెగలు ఉన్నాయని వివరించారు. తాను ఇప్పటివరకూ అధికారం కోసం పని చేయలేదని, కేవలం అవకాశాలు అడిగే స్థాయిలోనే ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో యాభై శాతం ఉన్న బీసీలు అంతా             ఐక్యంగా ఉండి అధికారాన్ని ఎందుకు సాధించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. గొడవలు జరిగినప్పుడు ఏకమవుతున్న వారంతా, తీరా ఓట్ల సమయానికి మాత్రం ముక్కలుగా విడిపోయి వేరే వారికి అవకాశాలు                           కట్టబెడుతున్నారని    పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.