- అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు.
- ప్రజా, పంట నష్టాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి.
- పినపాక, భద్రాచలం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి.భద్రాద్రి కొత్తగూడెం,మహా.
గోదావరి నదికి రానున్న వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గోదావరి వరదల కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో గోదావరి వరదల ముందస్తు ప్రణాళికపై ఆయన జిల్లా స్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రధానంగా గోదావరి పరీవాహక ప్రాంతాలైన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరద ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికే సన్నద్ధం చేశామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. గత వరదల సమయంలో ఎదురైన చేదు అనుభవాలను, అవాంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ముందస్తు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, మేయర్ మూడ్ గణేశ్ తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారందరితో మంత్రి వరద రక్షణ చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా గ్రామాల్లోకి వరద నీరు చేరితే తలెత్తే పరిణామాలపై ముందుగానే అంచనా వేయాలని అధికారులకు మంత్రి సూచించారు. వరదల ఉధృతి కారణంగా ఏయే గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు బ్లాక్ అవుతాయో ముందుగానే గుర్తించాలని స్పష్టం చేశారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే అలాంటి ముంపు గ్రామాలకు అత్యవసర వైద్య సేవలు అందించడంలోనూ, నిత్యావసర వస్తువుల రవాణాలోనూ ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ‘యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.
Post Views: 2








