Mahaa Daily Exclusive

  తగ్గిన వామపక్ష తీవ్రవాద ముప్పు. పలువురికి వీఐపీ హోదా కుదింపు 100 మందికి సెక్యూరిటీ తగ్గింపు జులై 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

Share

బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, గన్‌మెన్ల ఉపసంహరణ

హైదరాబాద్, మహా : దాదాపు ఐదీ దశాబ్ధాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ తర్వాత తెలంగాణలోని పలు సరిహద్దు ప్రాంతాలను వణికించిన వామపక్ష తీవ్రవాద సమస్య ఇప్పుడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, ముప్పు పూర్తిగా అదుపులోకి రావడంతో ఇన్నాళ్లూ వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు కల్పిస్తూ వచ్చిన అదనపు భద్రతను భారీగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర అత్యున్నత భద్రతా సమీక్ష కమిటీ (సెక్యూరిటీ రివ్యూ కమిటీ) క్షేత్రస్థాయి పరిణామాలను నిశితంగా పరిశీలించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన కొత్త భద్రతా నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయి.

రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి భద్రతా సమీక్ష కమిటీ అత్యవసరంగా సమావేశమై.. నిఘా విభాగం అందించే రహస్య సమాచారం ఆధారంగా వీఐపీల భద్రతను పునఃసమీక్షిస్తుంది. కొత్తగా ఎవరెవరికి ప్రాణహాని ఉంది? ఎవరికి కొత్తగా భద్రత కల్పించాలి ? ప్రస్తుతం భద్రత కలిగి ఉన్నవారిలో ఎవరికి ఎంత మేరకు రక్షణ కొనసాగించాలి, ఎవరికి తగ్గించాలి లేదా పూర్తిగా తొలగించాలి ? అనే విషయాలపై ఈ కమిటీ క్షుణ్ణంగా మదింపు చేస్తుంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ చీఫ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఈ తాజా సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా ప్రముఖుల భద్రతను భారీగా తగ్గించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 600 మందికి ప్రభుత్వం గన్‌మెన్లు, పీఎస్‌వోల రూపంలో రక్షణ కల్పిస్తోంది. ఇందులో ప్రజాప్రతినిధులు, గతంలో మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న కొందరికి బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలను కూడా ప్రభుత్వమే సొంత ఖర్చులతో సమకూరుస్తోంది. అయితే, దేశంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందని త్వరలోనే దేశం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఒకరిద్దరు అగ్రనేతలు మినహా క్షేత్రస్థాయిలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఎవరూ లేకపోవడంతో ముప్పు తీవ్రత తగ్గిందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, గతంలో మావోయిస్టు నిరోధక చర్యల్లో చురుగ్గా పాల్గొని పదవీ విరమణ చేసిన పలువురు మాజీ పోలీసు ఉన్నతాధికారులకు, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మాజీ, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు భద్రతను పూర్తిగా తొలగించడం లేదా తగ్గించారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే

ఈ భద్రత తగ్గింపుపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిఘా విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారి స్పందించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు, అంతర్గత ఉద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిఘా విభాగం సేకరించిన వాస్తవ సమాచారం, వారిపై ఉన్న ప్రస్తుత ముప్పు స్థాయి ఆధారంగానే పూర్తిగా పారదర్శక పద్ధతిలో ఈ సమీక్ష జరిగిందన్నారు. దానికి అనుగుణంగానే భద్రతా బలగాలను పునర్‌వ్యవస్థీకరించామని ఆయన వివరించారు.