డేటా ఆధారిత పాలనపై ‘చంద్రబాబు’ ఫోకస్.
* ఆర్టీజీఎస్ వేదికగా స్పెషల్ రివ్యూ!
* అమరావతి పనుల వేగవంతం.
* నవంబర్‌లో వైజాగ్‌లో ‘సీఐఐ’ సదస్సు.
* అధికారులకు సీఎం దిశానిర్దేశం
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో సాంకేతికతను, డేటాను సమర్థవంతంగా వాడుకుంటూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కాన్ఫరెన్స్ హాల్ వేదికగా ‘డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్’ పై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచడం, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా క్షేత్రస్థాయిలో పారదర్శకతను తీసుకురావడంపై అధికారులకు ఆయన పవర్ ఫుల్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో పారదర్శక పాలనకు అత్యంత కీలకమైన ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు, డేటా వినియోగంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయాలని, ‘మనమిత్ర’ ద్వారా ప్రజా ఫిర్యాదులను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రతిష్టాత్మక సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా, ఐటీ-ఆర్టీజీఎస్ శాఖల కార్యదర్శి కాటమనేని భాస్కర్‌తో పాటు వివిధ శాఖల ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు హాజరయ్యారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక సమీక్ష నిర్వహించారు. సీఆర్డీఏ అధికారులు, ఇంజినీర్లు, ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమై పనుల వేగాన్ని అంచనా వేశారు. రాజధాని అభివృద్ధి పనుల్లో నాణ్యత, వేగం అత్యంత ముఖ్యమని, నిర్దేశిత గడువుల్లోగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ విజయ్ విజయరామరాజుతో పాటు దేశంలోనే అగ్రగామి నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ, మేఘా, కేఎంవీ, బీఎస్‌సీపీఎల్, ఎంవీఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. తదుపరి కార్యాచరణపై వీరందరికీ సీఎం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చారు.
పాలన కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా ప్రజల చెంతకు చేరాలనే ఉద్దేశంతో జిల్లాల్లో అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక సర్క్యులర్ జారీ చేశారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. మరోవైపు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో ‘సీఐఐ భాగస్వామ్య సదస్సు’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల అధినేతలు, సీఈవోలను ఈ సదస్సుకు ఆహ్వానించనుండగా, దీనిపై కూడా ముఖ్యమంత్రి త్వరలోనే మరో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.







