- తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా వాడుకుంటోంది
- గిరిజనుల అభివృద్ధే బీజేపీ లక్ష్యం:
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
- పీవీని కాంగ్రెస్ అవమనిస్తే బీజేపీ భారతరత్నతో గౌరవించింది.
వరంగల్, మహా : తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎంలాగా వాడుకుంటోందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆ పార్టీ నెరవేర్చలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం వరంగల్లో జరిగిన గిరిజన నేతల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ మట్టిలో నాటి సమ్మక్క-సారలమ్మల వీరత్వపు స్ఫూర్తి ఇప్పటికీ ఇక్కడి గిరిజన మహిళల్లో స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న చోట్ల ఇప్పటికీ భూములకు సంబంధించిన ల్యాండ్ సర్వేలు జరగలేదని, ఉగ్రవాద భావజాలం ఉన్న ప్రాంతాల్లో ఇంతకాలం గిరిజనుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని నితిన్ నబీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గిరిజనుల సమగ్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. గత యూపీఏ కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే.. నేడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ. 15 వేల కోట్లను గిరిజనుల సంక్షేమం, ప్రగతి కోసం ఖర్చు చేస్తోందని లెక్కలతో సహా వివరించారు.
నాడు ఎలాంటి రాజకీయ లాభాలు, స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని నితిన్ నబీన్ గుర్తుచేశారు. ఆనాడు బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో చిన్నమ్మగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతగానో కొట్లాడారని స్మరించుకున్నారు. రాహుల్ గాంధీ ఒక పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, కానీ బీజేపీలోని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ప్రజా సేవ కోసం అంకితమైన ఫుల్ టైమ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ మాటను పూర్తిగా మరిచిపోయి నిరుద్యోగులను వంచించిందని మండిపడ్డారు.
పీవీని కాంగ్రెస్ అవమానిస్తే.. బీజేపీ భారతరత్నతో గౌరవించింది
దేశానికి ప్రధానమంత్రిగా విశేష సేవలు అందించిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విస్మరించిందని నితిన్ నబీన్ ఆరోపించారు. పీవీ మరణించిన సమయంలో ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా అవమానించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇచ్చి సముచితంగా గౌరవించిందని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని, చేస్తున్న ప్రతి మంచి పనిని బూత్ కమిటీ కార్యకర్తలు బాధ్యతగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పేలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు.








