బీఆర్ఎస్, కాంగ్రెస్‌లవి కుటుంబ రాజకీయాలే.
• తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారే లక్ష్యం.
• రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ నాయకుడు.
• బీజేపీ కార్యకర్తలు ఫుల్ టైమ్ సేవకులు.
• వరంగల్ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ దిశానిర్దేశం.
వరంగల్,మహా.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజల ఆశలు అడుగంటాయని.. ఎన్నో హామీలతో వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సైతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల సంక్షేమం కంటే తమ స్వంత ప్రయోజనాలకే పెద్దపీట వేశాయని దుయ్యబట్టారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా జరిగిన బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ‘పార్ట్ టైమ్’ రాజకీయ నాయకులని, 24 గంటలు ప్రజల కోసం శ్రమించే బీజేపీ కార్యకర్తలే ‘ఫుల్ టైమ్’ ప్రజా సేవకులని అభివర్ణించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తీసుకెళ్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి బూత్‌ను బలోపేతం చేస్తూ.. 2028లో తెలంగాణలో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలదళం సమరశంఖం పూరించాలని ఉద్బోధించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మించాలన్న లక్ష్యాన్ని కార్యకర్తల శక్తితోనే సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వంపై చూపుతున్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తూ, 2028లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. జాతీయవాద భావజాలం, భారతీయ సంస్కృతీ విలువల ఆధారంగా తెలంగాణకు కొత్త దిశానిర్దేశం చేస్తామన్నారు.
పోరాటాలకు, త్యాగాలకు ప్రతీక అయిన వరంగల్ గడ్డపై నుంచి ప్రసంగించడం గర్వంగా ఉందన్న ఆయన.. ఈ సందర్భంగా హైదరాబాద్‌ను అఖండ భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌ను, తెలంగాణ సాధన కోసం పోరాడిన వీరులను స్మరించుకున్నారు. తెలంగాణతో బీజేపీకి ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదని, అది పోరాటాలు, ప్రజా విశ్వాసంతో పెనవేసుకున్న అనుబంధమని స్పష్టం చేశారు. తెలంగాణకు బీజేపీ కొత్త పార్టీ అని విమర్శించే వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. 1980లో బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ రెండు ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, అందులో ఒకటి తెలంగాణ ప్రజలు ఇచ్చినదేనని, ఇది ఇరు పక్షాల మధ్య ఉన్న చారిత్రాత్మక బంధానికి నిదర్శనమని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీజేపీ రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకోలేదని, ప్రజల ఆకాంక్షలను గౌరవించిందని తెలిపారు. పార్లమెంటులో దివంగత సుష్మా స్వరాజ్ బలమైన గొంతుక వినిపించి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
రాష్ట్రం ఏర్పడినా ప్రజల కలలు ఇంకా నెరవేరలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని తమ కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిరంతరం పోరాడిందన్నారు. ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల కంటే తమ కుటుంబాలకే పెద్దపీట వేశాయని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శక్తి బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే రాహుల్ గాంధీ లాంటి వాళ్లు ‘పార్ట్ టైమ్’ నాయకులని, కానీ 24 గంటలు ప్రజల కోసం శ్రమించే బీజేపీ కార్యకర్తలు ‘ఫుల్ టైమ్’ సేవకులని ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా నిలవడం, అధికారంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా సేవ చేయడమే తమ విధానమన్నారు.
ప్రతి బూత్‌లో కమలం వికసించేలా కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని శ్రీ నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేయించడంతో పాటు, సమాజంలోని ప్రతి వర్గాన్ని బీజేపీతో మమేకం చేయాలన్నారు. యువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే అది మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు సామాన్యుల జీవితాల్లో గొప్ప మార్పులు తెచ్చాయని వివరించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ ద్వారా నాణ్యమైన వైద్యం, పీఎం స్వనిధి ద్వారా వీధి వ్యాపారులకు అండ, జన్ ధన్ యోజన ద్వారా అవినీతి రహితంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ వంటి విప్లవాత్మక పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మహిళల భద్రత, ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లు నిర్మించామన్నారు. అట్టడుగున ఉన్న చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నదే మోదీ లక్ష్యమని, “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే మంత్రంతో దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 2028 లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమరశంఖం పూరించాలని ఆయన ఉద్బోధించారు.








