Mahaa Daily Exclusive

  అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు…

Share

  • అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు
  • నిందితులకు లాయర్స్ షాక్
  • వారి తరపున వాదించకూడదని నిర్ణయం
  • ధిక్కరించిన వారికి రూ. 5 లక్షల భారీ జరిమానా అంటూ తీర్మానం
  • ఆరోపణలను ఎదుర్కుంటున్న ట్రస్ట్ సభ్యులు అయోధ్య విడిచి వెళ్ళాలని అల్టిమేటం

అయోధ్య, మహా : అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం, చోరీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న వేళ. ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయవాధుల సంఘం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల చోరీ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసింది. అయితే, ఈ నిందితుల తరఫున ఫైజాబాద్ బార్ అసోసియేషన్‌కు చెందిన ఏ ఒక్క లాయర్ కూడా కోర్టులో వకాలత్ పుచ్చుకోకూడదని, వారి తరఫున వాదించకూడదని బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ జనరల్ బాడీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ తీసుకున్న ఈ సామూహిక నిర్ణయాన్ని ఎవరైనా న్యాయవాది అతిక్రమించి, నిందితులకు లీగల్ సపోర్ట్ ఇస్తే.. సదరు లాయర్‌కు రూ.5 లక్షల భారీ పెనాల్టీ విధిస్తామని అసోసియేషన్ ప్రెసిడెంట్ కాళికా ప్రసాద్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారికంగా చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దేవుడికి సమర్పించిన కానుకలను దొంగిలించడం ద్వారా నిందితులు కోట్లాది మంది హిందువుల, భక్తుల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరిచారని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బార్ అసోసియేషన్ సెక్రటరీ శైలేంద్ర జైస్వాల్ వెల్లడించారు. ఫైజాబాద్ బార్ అసోసియేషన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2005 లో అయోధ్యలోని తాత్కాలిక రామాలయంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలోనూ.. సదరు ఉగ్రవాదుల తరఫున స్థానిక లాయర్లు ఎవరూ కోర్టులో వాదించకూడదని బార్ అసోసియేషన్ అప్పట్లోనే చారిత్రాత్మక తీర్మానం చేసింది.

ఈ సాధారణ సర్వసభ్య సమావేశంలో న్యాయవాదులు కేవలం నిందితులను దూరం పెట్టడమే కాకుండా.. ఈ వివాదంతో సంబంధం ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, అకౌంట్స్ ఆఫీసర్ గోపాల్ రావులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు ముగ్గురూ రాబోయే మూడు రోజుల్లోగా అయోధ్య నగరాన్ని విడిచి వెళ్లాలని, లేనిపక్షంలో అయోధ్య నగరాన్ని పూర్తిగా స్తంభింపజేస్తామని న్యాయవాదుల సంఘం అల్టిమేటం జారీ చేసింది. కాగా, ఈ వివాదం ముదరడంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలు ఇప్పటికే తమ ట్రస్ట్ పదవుల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

ఈ విరాళాల కుంభకోణంపై ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన సెట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, వారి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు తీవ్రతను బట్టి దీనిపై కేవలం స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోదని.. కోర్టు ద్వారా సెక్షన్ 156(3) కింద చంపత్ రాయ్, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ కి ఈ కేసును అప్పగించేలా చట్టపరంగా పోరాడతామని బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది.