ఢిల్లీ, మహా.
దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో దిల్లీలోని రేఖా గుప్తా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణహిత విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని భారీగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ‘దిల్లీ ఈవీ పాలసీ-2026’కు ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ పూర్తి మద్దతుతో రూపొందించిన ఈ నూతన విధానం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) తుది ఆమోదం లభించిన వెంటనే.. జులై 1, 2026 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నూతన పాలసీ మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
**రూ.15 వేల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం**
ఈ నూతన విధానం ద్వారా రాబోయే నాలుగేళ్లలో విద్యుత్ వాహన రంగంలో నేరుగా రూ.7,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్ను మినహాయింపులు, ఈవీ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యల ద్వారా దిల్లీ ప్రజలకు మొత్తంగా రూ.15,000 కోట్లకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడంతో పాటు, పాత వాహనాల స్థానంలో పర్యావరణహిత జీరో ఎమిషన్ వెహికల్స్ ను వినియోగంలోకి తీసుకురావడానికి భారీ స్థాయిలో స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు, కొనుగోలు సబ్సిడీలను ఈ విధానంలో పొందుపరిచారు.
**పాత వాహనాలపై ఆకర్షణీయమైన స్క్రాపేజ్ బోనస్**
ఈ ఈవీ పాలసీలో అత్యంత కీలకమైన అంశం పాత బీఎస్-4 లేదా అంతకంటే పాత వాహనాల స్క్రాపేజ్ విధానం. పాత వాహనాన్ని వదిలేసి కొత్త విద్యుత్ వాహనం కొనుగోలు చేసే వారికి సాధారణ సబ్సిడీలతో పాటు అదనంగా ఆకర్షణీయమైన స్క్రాపేజ్ ఇన్సెంటివ్ను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం.. ఎవరైనా తమ పాత కారును ఇచ్చేసి కొత్త ఈవీ కారు కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.1,00,000 వరకు భారీ స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. అదే విధంగా, వాణిజ్య ట్రక్కుల (N1 కేటగిరీ) కొనుగోలుపై రూ.50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఆటోల వంటి త్రీవీలర్లపై రూ.25,000 మరియు ద్విచక్ర వాహనాలైన బైక్‌లు, స్కూటర్లపై రూ.10,000 మేర అదనపు లబ్ధిని ప్రభుత్వం అందించనుంది.
**పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి వంద శాతం మినహాయింపు**
దిల్లీలో కొనుగోలు చేసే అన్ని రకాల ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి ఏకంగా వంద శాతం పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఈ పన్ను మినహాయింపు ఫోర్ వీలర్ల (కార్ల) కేటగిరీలో అందరికీ వర్తించదు. ఎక్స్-షోరూం ధర రూ.30 లక్షల లోపు ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే ఈ 100% పన్ను మినహాయింపు వర్తిస్తుందని పాలసీలో ప్రత్యేకంగా వెల్లడించారు.
**32 వేల ఈవీ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు**
దిల్లీలో ఈవీ విప్లవాన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నగరవ్యాప్తంగా కొత్తగా 32,000 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే వాణిజ్య వాహనాలు, డెలివరీ కోసం వాడే బైక్‌లు, ప్రభుత్వ మరియు వివిధ సంస్థాగత వాహన శ్రేణులను రాబోయే రోజుల్లో దశలవారీగా పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చనున్నారు. ఈ విప్లవాత్మక విధానం ద్వారా ఉద్గారాలు గణనీయంగా తగ్గిపోయి, దిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.
**కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం**
మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు, సంబంధిత వాటాదారులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ సమగ్ర ముసాయిదాను సిద్ధం చేశామన్నారు. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ స్థాయిలో ఈవీ రంగానికి మద్దతు ఇవ్వలేదని, జులై 1 నుంచి దిల్లీలో కొత్త వాహనం కొనే ప్రతి ఒక్కరికీ ఈ పాలసీ ద్వారా భారీ లాభం చేకూరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ విధాన రూపకల్పనకు, దిల్లీ పర్యావరణ పరిరక్షణకు పూర్తి మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.







