Mahaa Daily Exclusive

  బోడుప్పల్‌లో ఉద్రిక్తత..! తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అరెస్ట్..!

Share

  • తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అరెస్ట్!
  •  కాంగ్రెస్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.
  •  పోలీసుల లాఠీఛార్జిపై కవిత తీవ్ర ఆగ్రహం.

హైదరాబాద్, మహా.

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్ ప్రాంతంలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో తలపెట్టిన ‘భూ పోరాటం’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు బోడుప్పల్ చేరుకున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, టీఆర్‌ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కవితతో పాటు పలువురు టీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని, బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

**ఉద్యమకారుల రక్తం చిందింది.. కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది**

బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద కవిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప్పల్‌ గడ్డపై గురువారం తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని మాత్రమే తాము అడిగామని, అంతకుమించి వేరే ఎలాంటి కొత్త డిమాండ్లను అడగలేదని ఆమె స్పష్టం చేశారు.

ఇచ్చిన హామీలను గుర్తుచేసిన పాపానికి ఉద్యమకారులపై లాఠీఛార్జి చేసి, రక్తం చిందేలా కొట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ అన్యాయమైన చర్యలతో కాంగ్రెస్ సర్కార్‌కు నేటి నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభమైందని కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వాస్తవాలు తెలిసొచ్చేలా, వారు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వానికి ప్రతిరోజూ గుర్తు చేస్తూనే ఉంటామని, తమ పోరాటం ఆగదని కవిత తేల్చిచెప్పారు.