Mahaa Daily Exclusive

  అన్నాడీఎంకేకు భారీ షాక్..! 15,000 మంది అనుచరులతో టీవీకేలో చేరిన మాజీ మంత్రులు..!

Share

  •  15,000 మంది అనుచరులతో టీవీకేలో చేరిన మాజీ మంత్రులు!
  •  ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనన్న విజయభాస్కర్.
  •  విజయ్ నాయకత్వమే సముచితమని వెల్లడి.
  •  పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలూ అవుట్.

చెన్నై, మహా.

తమిళనాడు రాజకీయాల్లో గురువారం ఒక భారీ తిరుగుబాటు చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు కోలుకోలేని విధంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన అత్యంత కీలక నేతలు, మాజీ మంత్రులు డాక్టర్ సి. విజయభాస్కర్, ఎం.ఆర్. విజయభాస్కర్ అన్నాడీఎంకేకు గుడ్‌బై చెప్పి, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో అధికారికంగా చేరిపోయారు. వీరితో పాటు సుమారు 15,000 మంది మద్దతుదారులు, అనుచరులు కూడా కండువా మార్చేయడం తమిళనాట తీవ్ర రాజకీయ సంచలనంగా మారింది.

చెన్నై సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మామల్లపురంలో గల ఒక ప్రైవేట్ హోటల్‌లో గురువారం ఈ భారీ చేరికల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సభలో మంత్రి ఆధవ్ అర్జున కొత్తగా పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

**అధిష్ఠానం తీరుపై తీవ్ర అసంతృప్తి**

అన్నాడీఎంకే ప్రస్తుత నాయకత్వం అనుసరిస్తున్న పోకడలపై తీవ్ర అసంతృప్తితోనే తాము పార్టీ మారాల్సి వచ్చిందని మాజీ మంత్రులు బహిరంగంగానే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సి. విజయభాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తాము పార్టీ అధిష్ఠానానికి ఎన్నోసార్లు గట్టిగా సూచించామని, కానీ నాయకత్వం తమ మాటలను బేఖాతరు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎంజీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా.. దశాబ్దాల రాజకీయ శత్రువైన డీఎంకేతో పొత్తు కోసం అన్నాడీఎంకే ప్రయత్నాలు చేస్తుండటంతో తాము పార్టీలో ఇమడలేకపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపిన విజయ్ సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేయడమే సముచితమైన నిర్ణయమని తాము భావించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

**తరలివచ్చిన నేతలు, కార్యకర్తల సైన్యం**

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమిళనాడు రాజకీయాంతరంగంలో జరిగిన అత్యంత పెద్ద చేరికల కార్యక్రమంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ ఇద్దరు విజయభాస్కర్‌లతో పాటు అన్నాడీఎంకేకు చెందిన మరో మాజీ మంత్రి ఎస్. వలర్మతి, మాజీ మంత్రి ఎం.ఎస్.ఎం. ఆనందన్‌లతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఏకంగా 208 మంది యూనియన్ కార్యదర్శులు కూడా అధికారికంగా టీవీకే గూటికి చేరారు. కరూర్, పుదుక్కోట్టై జిల్లాల నుంచి సుమారు 200 బస్సులు, 600 కార్ల భారీ కాన్వాయ్‌లలో మద్దతుదారులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా సి. విజయభాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగిన చేరికలు కేవలం ఒక ‘ట్రైలర్’ మాత్రమేనని, రాబోయే ఎన్నికల్లో టీవీకే వంద శాతం అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.