Mahaa Daily Exclusive

  అనుమానం పెనుభూతం.. భార్యను చంపిన భర్త..

Share

  • హత్య తర్వాత వదినకు ఫోన్ చేసి చెప్పిన సురేష్

హైదరాబాద్, మహా : అనుమానం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడుతున్న భర్త.. చివరికి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత భార్య సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్‌లో జెస్సికా, సురేష్ దంపతులు గత 4 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. 2015లో వీరికి వివాహం జరగ్గా.. వారికి 10 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. బయటికి సాధారణ కుటుంబంలా కనిపించినా.. ఇంట్లో మాత్రం భార్యపై అనుమానంతో సురేష్ తరచూ గొడవలకు దిగేవాడని స్థానికులు చెబుతున్నారు.

 

ఈ క్రమంలోనే శనివారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన సురేష్.. భార్య జెస్సికాపై దాడి చేసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన అనంతరం సురేష్ స్వయంగా జెస్సికా అక్కకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Latest