హైదరాబాద్, మహా : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రతి నెల మొదటి తేదీన జీతాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఏడు నెలలు, నిలోఫర్ ఆసుపత్రిలో తొమ్మిది నెలలు, పంచాయతీరాజ్ శాఖలో మూడు నెలలు, వరంగల్ ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో నాలుగు నెలలుగా జీతాలు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రౌండ్ వాటర్, మున్సిపాలిటీలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పోలీస్ శాఖలు తదితర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు.
ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ నిధులను మినహాయించినప్పటికీ సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా కొంతమంది ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని జీతాలను తక్షణమే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈఎస్‌ఐ–ఈపీఎఫ్ చెల్లింపులు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్ట్ చేయాలని, ప్రభుత్వమే నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని, అన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.








