Mahaa Daily Exclusive

  పశుపతిలా కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించాం..! ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం…

Share

  •  మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు.
  •  ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మిడ్జిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం.

నాగర్‌కర్నూల్, మహా.

తెలంగాణను దశాబ్ద కాలం పాటు ఏలిన దొరలకు సామాన్యుల సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చని, కానీ పేదల మధ్య పెరిగిన తనకు ఆ కష్టాలన్నీ తెలుసునని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తట్ట పనికి, మట్టి పనికి మాత్రమే పాలమూరు బిడ్డలు కావాలా.. పరిపాలనకు పనికిరారా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అహంకారులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలోని మిడ్జిల్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గత ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.

**అరుంధతి పశుపతిలా ఫామ్‌హౌస్‌కే పరిమితం**

అరుంధతి సినిమాలో క్రూరుడైన పశుపతి పాత్రను సమాధిలో బంధించినట్లుగా, గత పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌లో బంధించారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన ఇక ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై మాట్లాడే తీరిక లేని నాయకులు, అధికారం ఇస్తే మాత్రం దోచుకోవడానికి వస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని, వారికి మళ్లీ అధికారం రావడం అనేది కేవలం పగటికలగానే మిగిలిపోతుందని స్పష్టం చేశారు. భూమికి, విత్తనానికి మధ్య ఎలాంటి బంధం ఉంటుందో.. పేదవాడికి, పరిపాలన చేసేవాడికి మధ్య అలాంటి బంధమే ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజాకవి గద్దరన్నను గడీల ముందు నిలబెట్టి అవమానించిన వారికి ఉరిశిక్ష వేసినా తక్కువేనని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

**మిగులు బడ్జెట్ నుంచి అప్పుల కుప్పగా..**

ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు, ఫామ్‌హౌస్‌లు, ఆస్తులు పెరిగాయని.. కానీ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మాత్రం అప్పులు మిగిలాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకున్నారని, చివరకు ఆడబిడ్డలకు పండుగకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

**దోపిడీకి అడ్డుకట్ట పడినందుకే ఈ ఏడుపులు**

రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ప్రజాపాలన’ పోవాలని ప్రతిపక్షాలు ఎందుకు కోరుకుంటున్నాయో ప్రజలు ఎక్కడికక్కడ చర్చ పెట్టాలని, వారిని నిలదీయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నందుకా? రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నందుకా? రాష్ట్రంలో యువతను నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో నియంత్రిస్తున్నందుకా? ఎందుకు ప్రజాపాలన పోవాలని అడుగుతున్నారో చెప్పాలన్నారు. కేవలం వారి దోపిడీకి అడ్డుకట్ట పడినందుకే ఈ ప్రభుత్వం పోవాలని వారు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మన లక్ష్యం

రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, అలాగే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభాముఖంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Latest