Mahaa Daily Exclusive

  తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది.. కేంద్ర మంత్రి బండి సంజయ్..

Share

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో హిందువుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి, అంచెలంచెలుగా పైకొచ్చిన వారేనని ఆయన ప్రశంసించారు. ఒకవైపు ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూనే, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

**గ్యారెంటీల అమలు ఏదీ.. ‘సర్’ పేరుతో కుట్రలు**

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండి సంజయ్ డిమాండ్ చేశారు. హామీల అమలును పక్కనపెట్టి ‘సర్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికారులకు ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందడం లేదని, పాలనాపరంగా ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పడుతోందని ఆయన మండిపడ్డారు.

**హిందువులను మైనారిటీలను చేసే కుట్ర**

రాష్ట్రంలో హిందువుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు భారీ కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ (ఎంఐఎం) పార్టీతో అధికార కాంగ్రెస్ కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే హిందువుల ఓట్లకు గండి కొడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ అండదండలతో జరుగుతున్న ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో హిందువులే మైనారిటీలుగా మారే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. ఇలాంటి కుట్ర రాజకీయాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

Latest