- ప్రజల మధ్య నుంచి ఎదిగిన నేత
- రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రజానాయకుడు
- సీఎం రేవంత్ రెడ్డి
- మంత్రి సీతక్క
- అలాంటి నాయకుడిపై విపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలి
నిజామాబాద్, మహా : కొండారెడ్డి పల్లెలో పుట్టి జెడ్పీటీసీగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా ఎదిగారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అన్నారు. ప్రజా జీవితంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మధ్య నుంచి ఎదిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడితేనే ప్రతిపక్షాలకు గౌరవం లభిస్తుందన్నారు.
నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, ప్రజల మధ్య నుంచే ఎదిగిన నాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకుని పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతు, యువత, మహిళలు, పేదల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రజానాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి విజ్ఞప్తి మేరకు గిరిజన సంక్షేమానికి సంబంధించిన హాస్టళ్లు, వసతి గృహాలు, డైనింగ్ హాళ్లు ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తండాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు రూ.7 కోట్లతో రెండు రోడ్లను ప్రారంభించామని, పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.80 కోట్లు, ఆర్అండ్బీ శాఖ ద్వారా మరో రూ.90 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని, వర్షాకాలం అనంతరం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్ల పాలనకు అవకాశం ఇచ్చారని, ఆ గడువులో ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రమే కాకుండా మేనిఫెస్టోలో లేని పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదలకు ఇళ్లు, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే భారీ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తోందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర వాటాను తగ్గించి రాష్ట్రాలపై అదనపు భారం మోపిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం తన బాధ్యతను నిర్వర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు మానుకుని ప్రజా ప్రయోజనాలపై నిర్మాణాత్మక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.








