Mahaa Daily Exclusive

  ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు..? కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్..!

Share

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ (బచ్చలకూరి జోసెఫ్) వ్యవహారంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కోర్టులు బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ, పోలీసులు పదేపదే పాత కేసుల్లో అతడిని అరెస్ట్ చేయడంపై ఏపీ కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ ఆయన సామాజిక మాధ్యమం (ట్విట్టర్/ఎక్స్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు.

**అరెస్ట్.. బెయిల్.. మళ్లీ అరెస్టా?**

యూట్యూబర్ రావణ్ వరుస అరెస్టుల పర్వాన్ని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుబట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతులను అణచివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. మళ్లీ అరెస్ట్. మీరు తప్పు చేస్తున్నారని మీకు కోర్టులు స్పష్టంగా చెప్పడం లేదా? మీ కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రశ్నించే వారిని అధికారాన్ని దుర్వినియోగం చేసి అణచివేయడం ఎంతవరకు సాగుతుంది? కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసు తెరిచి వేధించడం సిగ్గుచేటు”

అని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఘాటుగా విమర్శించారు.

 

30 కేసులు.. కక్షసాధింపే అన్న ప్రకాశ్ రాజ్

ఏలూరులో పవన్ కల్యాణ్‌పై రావణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత, తొలుత పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ కేసులో కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేయగా, వెంటనే సర్పవరం పోలీసులు మరో పాత కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలా రావణ్‌పై ఏకంగా 30 కేసులు ఉన్నాయని, ఇదంతా ప్రభుత్వం చేస్తున్న స్పష్టమైన ప్రతీకార చర్య అని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

ప్రశ్నిస్తే చంపేస్తారా?

ఇదే క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న రావణ్‌ను తరలిస్తుండగా, ఆ పోలీసు వాహనాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనను కూడా ప్రకాశ్ రాజ్ తన పోస్టులో ప్రస్తావించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా జరుగుతున్న ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. “ప్రశ్నిస్తే చంపేస్తారా?” అంటూ ఆయన ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు.

Latest