Mahaa Daily Exclusive

  కశ్మీర్ లోయలో మువ్వన్నెల రెపరెపలు..! 250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ..!

Share

  •  250 అడుగుల ఎత్తైన జాతీయ జెండా ఆవిష్కరణ!
  •  దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగాలకు అరుదైన నివాళి.

శ్రీనగర్,మహా.

పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు కీలక ప్రవేశ మార్గమైన జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా చందన్‌వాడిలో భారత సైన్యం సగర్వంగా భారీ జాతీయ జెండాను ఆవిష్కరించింది. భారత సైన్యానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘చినార్ కార్ప్స్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకం ఏకంగా 250 అడుగుల ఎత్తులో సగర్వంగా రెపరెపలాడుతోంది. దక్షిణ కశ్మీర్ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన జాతీయ జెండాగా రికార్డు సృష్టించిన దీన్ని సైన్యం దేశానికి అంకితం చేసింది.

**జాతీయ ఐక్యతకు సజీవ సాక్ష్యం**

అమర్‌నాథ్ యాత్రలో పహల్గామ్ మార్గానికి ప్రవేశ ద్వారంగా భావించే చందన్‌వాడిలో ఈ కార్యక్రమాన్ని ఆర్మీ అత్యంత ఘనంగా నిర్వహించింది. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకలో దేశభక్తి ఉప్పొంగింది. దక్షిణ కశ్మీర్‌లో ఇంత ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు పౌరులు, సాయుధ దళాల మధ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేయడమేనని భారత సైన్యం వెల్లడించింది. అందమైన మంచు పర్వతాల మధ్య ఎగురుతున్న ఈ భారీ త్రివర్ణ పతాకం ప్రతి ఏడాది అమర్‌నాథ్ యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు, స్థానిక ప్రజలకు జాతీయ ఐక్యత, ఉమ్మడి సంకల్పానికి నిలువెత్తు చిహ్నంగా నిలుస్తుందని సైన్యం పేర్కొంది.

**వీర జవాన్ల త్యాగాలకు నివాళి**

దేశ సరిహద్దుల రక్షణతో పాటు జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలు, స్థిరత్వం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, అమర్‌నాథ్ యాత్ర విజయవంతమైన నిర్వహణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ జాతీయ జెండాను దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు దక్కుతున్న శాశ్వత నివాళిగా చినార్ కార్ప్స్ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి చినార్ కార్ప్స్‌కు చెందిన సీనియర్ సైనికాధికారులు, ఆర్మీ సెక్టర్ కమాండర్, కమాండింగ్ ఆఫీసర్, కాశ్మీర్ ఐజీ, దక్షిణ కాశ్మీర్ డీఐజీ సహా పలువురు ఉన్నతాధికారులు, పౌర యంత్రాంగ ప్రతినిధులు, మాజీ సైనికులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో హాజరయ్యారు.

250 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతున్న జెండాను చూసి స్థానికులు విశేషంగా హర్షం వ్యక్తం చేశారు. రేయింబవళ్లు శ్రమిస్తూ, తమకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తున్న భద్రతా దళాలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

**సముద్ర గర్భంలోనూ మువ్వన్నెల సవ్వడి**

కశ్మీర్ లోయలోనే కాకుండా గతంలో అండమాన్ నికోబార్ దీవుల్లోని రాధానగర్ బీచ్‌లో కూడా భారత జాతీయ జెండా సముద్రపు నీటి అడుగున రెపరెపలాడి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. 223 మంది స్కూబా డైవర్లతో కూడిన ప్రత్యేక బృందం ఏకకాలంలో అత్యంత సమన్వయంతో సముద్ర జలాల అడుగున జాతీయ జెండాను ప్రదర్శించి దేశభక్తిని, కచ్చితత్వాన్ని చాటిచెప్పిన అరుదైన విషయాన్ని ఈ సందర్భంగా సైనిక వర్గాలు గుర్తుచేశాయి.

Latest