Mahaa Daily Exclusive

  భద్రతా బలగాల చేతిలో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ హతం..

Share

  • మరో ఉగ్రవాది కసం గాలింపు ముమ్మరం
  • కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

జమ్మూ, మహా : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ భారత భద్రతా దళాలు మరో అదిరిపోయే సక్సెస్ సాధించాయి. షోపియాన్ జిల్లాలో గత ఐదు రోజులుగా సాగుతున్న హై-వోల్టేజ్ ‘కౌంటర్ టెర్రరిజమ్’ ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతమయ్యాడు. భద్రతా బలగాలు అతడిని కాల్చి చంపాయి. ఘటనా స్థలం నుంచి అతడి మృతదేహాన్ని కూడా సైన్యం స్వాధీనం చేసుకుంది.

 

అసలు ఈ ఆపరేషన్ ఎలా స్టార్ట్ అయిందంటే… జులై 3న షోపియాన్‌లోని తోటల ప్రాంతంలో అమర్చిన నిఘా కెమెరాల్లో ఈ టాప్ కమాండర్ జాకీర్ గనాయ్‌తో పాటు లతీఫ్ అనే మరో ఉగ్రవాది కదలికలు రికార్డయ్యాయి. దీంతో .. పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగిన భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జాయింట్ టీమ్‌గా ఏర్పడి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దట్టమైన తోటల గుండా ఉగ్రవాదులు ఎస్కేప్ కాకుండా ఉండేందుకు ఆర్మీకి చెందిన స్పెషల్ విభాగానికి చెందిన ‘విక్టర్ ఫోర్స్’ రంగంలోకి దిగి, బయటకు వెళ్లే దారులన్నింటినీ పూర్తిగా బ్లాక్ చేసింది. రాత్రి వేళల్లో కూడా చీకటిని చీల్చుకుంటూ ఆపరేషన్ సాగించేందుకు స్పెషల్ లైటింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు.

 

భద్రతా దళాలు వాళ్లు నక్కిన చోటికి చేరువవుతున్న సమయంలో… ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మన జవాన్లు ధీటుగా బదులివ్వడంతో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రస్తుతానికి అక్కడ దాక్కున్న రెండో ఉగ్రవాది లతీఫ్ కోసం దళాలు వేటను మరింత ముమ్మరం చేశాయి. కశ్మీర్ లోయలో ‘లష్కరే’ నెట్‌వర్క్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.