Mahaa Daily Exclusive

  ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ భారీగా సోదాలు..

Share

  • ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై సోదాలు

హైదరాబాద్, మహా : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారులు బుధవారం భారీగా సోదాలు చేపట్టారు. ఐసీస్, ఏక్యూఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారంపై సోదాలు చేశారు. భారత్‌లో హింసాత్మక జిహాద్ ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు కుట్రపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాలు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితులు, ఓ బాలుడిని జువెనైల్ నుంచి అదుపులోకి తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. విజయవాడ పోలీసులు మార్చిలో నమోదు చేసిన కేసును మేలో ఎన్‌ఐఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.

 

ప్రధాన నిందితుడు రెహ్మతుల్లా షరీఫ్ మహ్మద్ నివాసంలో గతంలో ఐసీస్, ఏక్యూఐఎస్‌కు సంబంధించిన అభ్యంతరకర ప్రచార సామగ్రి లభ్యమైంది. గతంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాల సాంకేతిక విశ్లేషణ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు బుదవారం సోదాలు నిర్వహించారు. అరెస్టైన నిందితులు దేశంలోని యువతను జిహాదీ భావజాలం వైపు మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ హ్యాండ్లర్లతో ఆన్‌లైన్ ద్వారా సంబంధాలు కొనసాగిస్తూ ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. దేశాన్ని అస్థిరపరిచి ‘ఖలీఫత్’ స్థాపనకు కుట్ర పన్నిన వారిని గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.