Mahaa Daily Exclusive

  మనవడి కోసం వంటగదిలోకి సీఎం రేవంత్..! స్వయంగా పూరీలు చేసిన తాత..

Share

  • స్వయంగా పూరీలు చేసిన తాత.
  • మధుర క్షణాలను పంచుకున్న ముఖ్యమంత్రి

 

హైదరాబాద్, మహా.

రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు, రాజకీయ కార్యక్రమాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబంతో గడిపిన ఆప్యాయ క్షణాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. మనవడి కోరికను తీర్చేందుకు స్వయంగా వంటగదిలోకి వెళ్లి పూరీలు తయారు చేసిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా, అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

 

వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి వంటగదిలోకి వెళ్లి ఎంతో ఆప్యాయంగా గడిపిన దృశ్యాలు కనిపించాయి. మనవడిని పక్కన కూర్చోబెట్టుకుని పిండిని కలిపి, చపాతీ పీటపై పూరీలు ఒత్తి, వేడినూనెలో స్వయంగా వేస్తూ సందడి చేశారు. పూరీలు గుండ్రంగా వస్తున్నాయా? ఇంకా ఎన్ని కావాలి? అంటూ మనవడితో సరదాగా మాట్లాడుతూనే వంట పూర్తి చేశారు. కుటుంబ సభ్యులతో గడిపిన ఈ క్షణాలు ముఖ్యమంత్రి వ్యక్తిగత జీవితంలోని మరో కోణాన్ని ప్రతిబింబించాయి.

 

ఈ వీడియోకు రేవంత్ రెడ్డి భావోద్వేగభరితమైన వ్యాఖ్యను జత చేశారు. “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని మనవడు అడిగితే తప్పుతుందా? పక్కన మనవడు.. చేతిలో పిడికెడు పిండి.. దోసిట్లో నవ్వులు.. గుండ్రంగా లేని డజను పూరీలు.. బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని పేర్కొన్నారు.

 

ముఖ్యమంత్రి పోస్టు చేసిన ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ప్రజా జీవితంలోని ఒత్తిడికి మధ్య కుటుంబ సభ్యులతో గడిపిన ఈ ఆప్యాయ క్షణాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పలువురు ఈ వీడియోపై స్పందిస్తూ తాత–మనవడి అనుబంధాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ముఖ్యమంత్రి నిరాడంబరతను అభినందిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Latest