Mahaa Daily Exclusive

  రాసిపెట్టుకో కేసీఆర్….

Share

రాసిపెట్టుకో కేసీఆర్..
* 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ దే పీఠం!
* ముందస్తు లేదు.. 2029 జూన్‌లోనే ఎన్నికలు.
* పాపాల భైరవుడ్ని ఫాంహౌస్‌లో బంధించాం.
* బీఆర్‌ఎస్‌ను ఇక మొలకెత్తనీయం.
* ఖమ్మం సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు.
హైదరాబాద్, మహా.

**భద్రాచలం రాముడి సాక్షిగా రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన సమర శంఖారావం పూరించారు. ముందస్తు ముచ్చటే లేదని, 2028 డిసెంబర్‌లో ఎలాంటి ఎన్నికలు జరగవని, 2029 మే లేదా జూన్‌లోనే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరుగుతాయని ఆయన కుండబద్దలు కొట్టారు. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని, తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు పెరగడం ఖాయమని కీలక జోస్యం చెప్పారు. ‘రాసిపెట్టుకో కేసీఆర్’ అంటూ ప్రతిపక్ష నేతకు నేరుగా సవాల్ విసిరిన ముఖ్యమంత్రి.. పెరిగిన 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117కు పైగా సీట్లను కైవసం చేసుకుని రెండోసారి సగర్వంగా అధికారాన్ని చేపడుతుందని ఉద్ఘాటించారు. సరిగ్గా ముప్పై ఆరు నెలల ముందుగానే ఎన్నికల ఫలితాలను గంటాపథంగా చెబుతున్నానని, కాంగ్రెస్ ప్రజాపాలన రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకురావడం తథ్యమని సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ధీమాగా ప్రకటించారు.**

రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీని ఇక మళ్లీ మొలకెత్తనీయబోమని, ఆ పాపాల భైరవుడ్ని ఫాంహౌస్‌కే పరిమితం చేసి బంధించామని కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మాయమాటలు, డబ్బు మూటలతో వస్తున్నారని, వారిని ఎలా ఎదుర్కొంటారని పలువురు తనను ప్రశ్నించారని, అయితే అప్పుడే కాంగ్రెస్ 65 స్థానాలు గెలుస్తుందని గంటాపథంగా చెప్పినట్లు గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతో 64 స్థానాలు సాధించామని, ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు దక్కించుకున్నామని, ఇక ముందు జరగబోయే రాజకీయ కురుక్షేత్రంలోనూ గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు.

**2029 ఎన్నికల సమర శంఖారావం.. సీట్ల పెంపుపై కీలక జోస్యం**
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం రాముడి సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. 2028 డిసెంబర్‌లో ఎలాంటి ముందస్తు ఎన్నికలు జరగవని, 2029 మే లేదా జూన్‌లోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని, ఆ తర్వాత తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుంచి 26కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. రాసిపెట్టుకో కేసీఆర్ అంటూ సవాల్ విసిరిన ఆయన, ఆ 182 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117కు పైగా సీట్లు గెలిచి, రెండోసారి సగర్వంగా ప్రజాపాలనను తీసుకొస్తుందని ఉద్ఘాటించారు. ముప్పై ఆరు నెలల ముందుగానే ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తున్నానని, కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో రామరాజ్యాన్ని తీసుకువస్తుందని ముఖ్యమంత్రి ఎంతో ధీమా వ్యక్తం చేశారు.

**రాజకీయ ఎదుగుదలకు ఖమ్మమే గుండెకాయ**
ఖమ్మం జిల్లాతో తనకున్న అవినాభావ సంబంధాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికగా పంచుకున్నారు. రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, తన రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని ఆయన ఆత్మీయంగా అభివర్ణించారు. 2023 జూలైలో నాడు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అహంకార పాలనను కాదని కాంగ్రెస్‌లో చేరినప్పుడు ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌కు బొంద పెట్టారని గుర్తుచేశారు. సరిగ్గా ముప్పై ఆరు నెలల తర్వాత మళ్లీ అదే జూలైలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి రైతాంగం వేలాదిగా తరలిరావడం హర్షణీయమన్నారు. గత పాలనలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులకు బేడీలు వేశారని మండిపడ్డ ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరిక మేరకు మధిరకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

**దొంగ సర్వేలతో బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం**

కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు కేసీఆర్ దొంగ ఏజెన్సీలతో దొంగ సర్వేలు చేయిస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఏసీ గదుల్లో కూర్చుని ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండానే గెలుపు ఓటములను ఎలా నిర్ణయిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగితేనే రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని, దానిని నీటితో మళ్లీ నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడని, ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గుడా, నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా అని ప్రశ్నిస్తే కేసీఆర్ వద్ద సమాధానం లేదని సీఎం దుయ్యబట్టారు. బ్యాండ్‌మేళం బ్యాచ్‌లా బీఆర్ఎస్ సర్వేల బ్యాచ్ తయారైందని, జూబ్లీహిల్స్‌లో కూర్చుని ఇలాగే అబద్ధాలు చెబితే జనం బీఆర్ఎస్‌ను బండకేసి కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

**బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం**

కేసీఆర్ కుటుంబంలోనే ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, ఒకే ఇంట్లో రెండు గుంపులున్నాయని ముఖ్యమంత్రి విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీలోకి వెళ్లనని హరీష్ రావును కేసీఆర్‌పై ఒట్టేసి చెప్పమనాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ ఎక్కడుంటాడో తెలియదని, ఆయన బావ ఎటు పోతాడో అర్థం కాని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని ఎగతాళి చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని స్వయంగా కేసీఆర్ సొంత చెల్లెలే చెబుతోందని, ఆంధ్ర కాంట్రాక్టర్లు వందల కోట్లు ఇచ్చారని ఆమె అన్న మాటలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఒకరు కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటారని, మరొకరు ఇంకో మాట చెబుతారని, ఇలా ఒకరికొకరు పొంతన లేకుండా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

**రైతే రాజు.. పండుగలా వ్యవసాయం**

రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పిన మాటలను సీఎం గుర్తుచేశారు. వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెబుతూ, వానాకాలం సీజన్‌కు సంబంధించి తుది విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1009.15 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. గడిచిన తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్ల మేరకు 73.30 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం జమ చేశామని, మొత్తంగా ఇప్పటిదాకా రూ. 8,759 కోట్ల సాయం పంపిణీ చేశామని వివరించారు. సభా వేదికగా రైతులకు అత్యాధునిక ఈ-పట్టాదారు పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, ప్రతి నెలా సగటున రూ. 5,500 కోట్లు కేవలం రైతు సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

**పాత పథకాల కొనసాగింపు.. పేదలకు మరిన్ని అభయహస్తాలు**

గత ప్రభుత్వం అమలు చేసిన మంచి పథకాలను ఎక్కడా ఆపలేదని, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి వాటిని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం ముప్పై నెలల కాలంలో రూ. 80 వేల కోట్ల మేరకు వడ్ల కొనుగోలు చేశామని, అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. మహిళా సంఘాలకు వెయ్యి బస్సులు, బ్యాంకుల లింకేజీతో రూ. 60 వేల కోట్ల రుణాలు, మహిళలకు పండుగ సారెగా ఇందిరమ్మ చీరలు, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 67,717 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేసి చూపించామని వివరించారు.

**పద్దెనిమిది గంటల శ్రమ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం**

తెలంగాణను దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజా ప్రభుత్వంలో మంత్రిమండలి సభ్యులంతా రోజుకు 18 గంటలు విశ్రమించకుండా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా ఏ ఒక్క వర్గానికీ అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సభలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 26 పార్లమెంట్ స్థానాలకు గాను 20 స్థానాలు కాంగ్రెస్‌కు కట్టబెట్టి, కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఔర్ ఏక్ బార్, కాంగ్రెస్ సర్కార్ అంటూ సభా ప్రాంగణంలో నూతనోత్సాహాన్ని నింపుతూ ముఖ్యమంత్రి తన ఆవేశపూరిత ప్రసంగాన్ని ముగించారు.

Latest