- ప్రమాదానికి గురైన బోటులో 32 మంది ఉన్నట్లు సమాచారం
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ఎంబసీ
హనోయ్, మహా : వియత్నాంలో భారత టూరిస్టులు ఉన్న బోటు ప్రమాదానికి గురైంది. వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుక్వోక్ ద్వీపం సమీపంలో ఒక పడవ బోల్తా పడింది. ఈ పడవలో వెళ్తున్న వారిలో 18 మంది మృతిచెందారని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణకు చెందిన టూరిస్టులు దాదాపు 32 మంది ఆ బోటులో ఉన్నారు. లావా కంపెనీ తరఫున ఏపీకి చెందిన పలువురు విహారయాత్రకు వెళ్లారు. తాము స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు, బోటులో మొత్తం ఎంతమంది పర్యాటకులు ఉన్నారు.. వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో స్పందిస్తూ.. ‘ఓ విషాదకరమైన ఘటనలో, కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. స్థానిక అధికారులు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం’.అని పేర్కొంది. ప్రమాదానికి గురైన పర్యాటకుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు, అవసరమైన సహాయం చేయడానికి భారత ప్రభుత్వం వియత్నాంలో తక్షణమే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.







