Mahaa Daily Exclusive

  డిగ్రీతోనే ఆగొద్దు.. ఆవిష్కరణలతో ముందుకు సాగండి – గవర్నర్ అబ్దుల్ నజీర్

Share

విశాఖపట్నం, మహా .
యువత కేవలం డిగ్రీలు సాధించడానికే పరిమితం కాకుండా పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల స్థాపన దిశగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్‌. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే సృజనాత్మకత, నూతన ఆలోచనలు, నైపుణ్యాల పెంపు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణ విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలు ప్రదానం చేయగా, వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి వి.వి. సుబ్బారావు, నిర్మాణ్ సంస్థ సీఈఓ మయూర్ పట్నాల, పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రస్తుత కాలంలో డిగ్రీ ఒక్కటే విజయానికి ప్రమాణం కాదని గవర్నర్ స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం సాధించి, వాటిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు.

జేఎన్‌టీయూ-జీవీ ఉన్నత విద్యా ప్రమాణాలతో నాణ్యమైన బోధన అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన విద్యా, శిక్షణా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ప్రశంసించారు.

పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ విశ్వవిద్యాలయం ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. జల సంరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేయడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం, క్యాంపస్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ‘నెట్ జీరో క్యాంపస్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న తీరును అభినందించారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సమ్మర్ ఇంటర్న్‌లుగా హాస్టల్ భవనాల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను స్వయంగా పూర్తి చేయడం అభినందనీయమని చెప్పారు.

జాతీయ విద్యా విధానం–2020 విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనా విధానం, నైతిక విలువలను పెంపొందించేలా రూపుదిద్దుకుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

Latest