ఢిల్లీ, మహా.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యపరమైనవి కావని, అవి స్నేహం, విశ్వాసం, ఉమ్మడి విలువల పునాదులపై బలంగా నిర్మితమయ్యాయని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా రెండో రోజు ఆక్లాండ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ ప్రసంగంలో న్యూజిలాండ్ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉన్న ‘వాకా’ (సంప్రదాయ పడవ) గురించి ప్రధాని ఆసక్తికరంగా ప్రస్తావించారు. వాకా అనేది కేవలం ఒక పడవ మాత్రమే కాదని, రెండు దేశాల ఉమ్మడి ప్రయాణానికి అదొక ప్రతీక అని అభివర్ణించారు. భారత్-న్యూజిలాండ్ భాగస్వామ్యం అనే ‘వాకా’ ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్య ప్రయాణ విజయానికి తాను కారణం కాదని, ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రైస్ట్‌చర్చ్ నుంచి క్వీన్స్‌టౌన్ వరకు విస్తరించి ఉన్న ప్రవాస భారతీయులే ఈ స్వర్ణయుగ ప్రయాణానికి అసలైన నావికులని మోదీ కొనియాడారు.
భారతీయుల ప్రతిభను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పిస్తున్న అద్భుతమైన దేశం న్యూజిలాండ్ అని మోదీ ప్రశంసించారు. ఎయిర్ న్యూజిలాండ్ సీఈఓ నిఖిల్ రవిశంకర్, మాజీ గవర్నర్ జనరల్ ఆనంద్ సత్యానంద్, క్రికెటర్లు రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, అజాజ్ పటేల్ తదితరులు వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, బాంబే హిల్స్, కోరమాండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్, అమృత్‌సర్ స్ట్రీట్ వంటి భారతీయ పేర్లతో న్యూజిలాండ్‌లో ప్రాంతాలు ఉండటం రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక అనుబంధానికి అద్దం పడుతోందన్నారు.
ఈ సందర్భంగా న్యూజిలాండ్‌తో తనకు ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే ఈ దేశాన్ని సందర్శించే అవకాశం వచ్చిందని, అప్పట్లో ఒక స్థానిక పౌరుడు తనకు ప్రేమతో ఇచ్చిన మఫ్లర్, టోపీ, గ్లౌజులను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నానని ఆత్మీయంగా పంచుకున్నారు. అందులో న్యూజిలాండ్ ప్రజల ప్రేమను చూసుకుంటున్నానని తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి చేర్చడంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకమని స్పష్టం చేసిన మోదీ.. ఈ బంధానికి అండగా నిలుస్తున్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో పాటు ఇతర ప్రభుత్వ ప్రతినిధులు, లేబర్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







