Mahaa Daily Exclusive

  ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి..

Share

  • ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి
  • గుర్తింపు కమిటీకి జేఏసీ నేతల వినతి
  • 15 కీలక సూచనలు అందజేత

హైదరాబాద్, మహా : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, వారికి అందించాల్సిన సంక్షేమ చర్యలపై తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావుతో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు శనివారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ 1969 నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ గుర్తించాలని కోరారు. ఇప్పటికే గుర్తించిన అమరవీరుల కుటుంబాలతో పాటు మిగిలిన కుటుంబాలకు కూడా ఉద్యోగం లేదా నెలకు రూ.25 వేల పెన్షన్, గృహ వసతి కల్పించాలని సూచించారు. ఉద్యమంలో జైలుకు వెళ్లిన వారికి, ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిర్బంధాల కారణంగా అంగవైకల్యం లేదా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నాయకులను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారిక కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాలని, వయోపరిమితి దాటిన ఉద్యమకారులకు రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో ప్రత్యేక రిజర్వేషన్, ఉద్యమకారులకు వైద్య సదుపాయాలు, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, చట్టబద్ధ కమిషన్‌గా మార్చి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
స్వాతంత్ర్య సమరయోధులకు కల్పిస్తున్న తరహాలోనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్ని సంక్షేమ ప్రయోజనాలు అందించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని దేవీప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest