హైదరాబాద్, మహా.
తెలంగాణను డ్రగ్స్ రవాణా కేంద్రంగా మార్చే ప్రయత్నాలపై ఈగల్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్, కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వరుస ఆపరేషన్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత ఏడాదిలో ఏకంగా ఏడు టన్నుల గంజాయిని పట్టుకోవడంతో పాటు, తాజాగా ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దులో 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రగ్స్ మాఫియాకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు.
ఈ కేసులో ఈగల్ ఫోర్స్ అధికారులు ఏడు రోజులపాటు నిఘా నిర్వహించి డ్రగ్స్ రవాణా ముఠా కదలికలను నిశితంగా గమనించారు. ఒడిశాలోని జయ్‌పూర్ సమీపంలోని దేవఘాటి ప్రాంతం నుంచి బయలుదేరిన గంజాయి లోడ్‌ను నిరంతరం అనుసరిస్తూ దాని ప్రయాణ మార్గంపై సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని కేంద్ర మాదకద్రవ్య నియంత్రణ సంస్థ అధికారులతో పంచుకోవడంతో కోల్‌కతా–ముంబై జాతీయ రహదారిపై వాహనాన్ని అడ్డుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలిస్తున్న ఈ గంజాయి గమ్యస్థానానికి చేరకముందే పట్టుబడింది. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ మహదేవ్ భీల్‌ను అరెస్టు చేసిన అధికారులు, డ్రగ్స్ సరఫరా గొలుసుపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ అందించిన కచ్చితమైన నిఘా సమాచారం కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ జాతీయ స్థాయిలో సమర్థవంతమైన సంస్థగా గుర్తింపు పొందుతోంది. గతంలో రాంచీలో 500 కిలోలు, ఒడిశాలో మరో 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, తాజాగా మరో భారీ పట్టివేతతో డ్రగ్స్ మాఫియాపై తమ దూకుడును కొనసాగించారు. రాష్ట్ర సరిహద్దులను దాటి ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తున్న ఆపరేషన్లు ఫలితాలను ఇస్తున్నాయి.
డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంతో మరింత కఠిన చర్యలు కొనసాగుతాయని ఈగల్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు 1908 హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.








