హైదరాబాద్, మహా.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం అంశంపై ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకే ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంపీ ఈటల రాజేందర్‌పై వ్యక్తిగతంగా తమకు గౌరవం ఉందని, అయితే కాళేశ్వరం విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ గౌరవాన్నే దెబ్బతీశాయని సీఎం అన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2019 జూన్ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో తలెత్తిన లోపాలు తమ ప్రభుత్వ హయాంలో ఏర్పడినవి కావని, కేసీఆర్ ప్రభుత్వ కాలంలోనే అవి వెలుగులోకి వచ్చాయని సీఎం వివరించారు. ప్రాజెక్టు ప్రారంభమైన పదకొండు నెలలకే నిర్మాణ లోపాలు బయటపడ్డాయని, 2020 మే 18న అప్పటి ఇంజినీర్ రమణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసి బ్యారేజ్‌లో ఉన్న లోపాలను ప్రస్తావించారని చెప్పారు. ఆ సమయంలోనే ఇంజినీర్లు లోపాలను సరిదిద్దాలని సూచించినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్‌లో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని సీఎం పేర్కొన్నారు. 2022 జులై 14న వరదల ప్రభావంతో కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిందని, ఇప్పటికీ అది పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని తెలిపారు. అనంతరం 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న లోపాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ కమిటీని కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేశారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలంగా లేవని ఆ కమిటీ తన ప్రాథమిక, తుది నివేదికల్లో స్పష్టంగా పేర్కొందన్నారు. ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని నిపుణులు అప్పుడే సూచించినా వాటిని ఎందుకు సరిదిద్దలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్, హరీశ్‌రావు తమ ప్రభుత్వంపై పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజల ముందుంచి వాస్తవాలను తెలియజేస్తామని, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.








