ఢిల్లీ, మహా.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని దేశ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. ఇరాన్ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా ఈ హెచ్చరిక చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసిన సందేశంలో తన తండ్రి రక్తం చిందడానికి కారణమైన వారిపై గట్టి ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండు యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ ప్రజల తరఫున కూడా తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు మొజ్తాబా ఖమేనీ కృతజ్ఞతలు తెలిపారు. శత్రువర్గాలకు స్పష్టమైన సందేశం వెళ్లేలా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. ఇరాన్, ఇరాక్ నుంచి లక్షలాది మంది ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొనడం చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.
మరోవైపు ఇటీవల గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌తో శాంతి ఒప్పందం ముగిసిపోయిందని వ్యాఖ్యానించినప్పటికీ, అమెరికా ఇప్పటికీ చర్చలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ప్రతినిధుల బృందం శనివారం ఒమన్‌కు చేరుకుని అమెరికా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.
హోర్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై జరిగిన దాడి ఉద్దేశపూర్వకంగా కాదని, అది పొరపాటున జరిగిందని ఇరాన్ ప్రతినిధులు అమెరికా సలహాదారులకు వివరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ముందుకు సాగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్‌లోని కొందరు అతివాద వర్గాలు ఈ దాడికి పాల్పడ్డాయని కూడా ఇరాన్ బృందం వివరించినట్లు వార్తలు పేర్కొన్నాయి. ఈ చర్చల ఫలితాలపై అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.







