భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌పై సింగరేణి దృష్టి
* బెల్లంపల్లిలో పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు.
హైదరాబాద్, మహా.
బొగ్గు వినియోగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్ ఇంధన అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగేందుకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కీలక చర్యలు చేపడుతోంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ సాంకేతికతను అమలు చేసే దిశగా సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా భూగర్భంలోనే బొగ్గును వాయురూపంలోకి మార్చి ఇంధన అవసరాలకు వినియోగించే సాంకేతికత సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాల్లోని ఐదు లోతైన బొగ్గు బ్లాక్‌లను సింగరేణి అధికారులు గుర్తించారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బొగ్గు నాణ్యత, గ్యాసిఫికేషన్‌కు అనుకూల పరిస్థితులపై సమగ్ర అధ్యయనాలు చేపట్టనున్నారు.
భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌కు ఉన్న అవకాశాలను శాస్త్రీయంగా పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ సాంకేతికత ద్వారా లోతైన గనుల్లో సంప్రదాయ పద్ధతులతో వెలికితీయడం కష్టమైన బొగ్గును కూడా సమర్థవంతంగా వినియోగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో అమలవుతున్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు సింగరేణి ప్రత్యేక బృందాన్ని పంపించనున్నారు. అక్కడి అనుభవాలను పరిశీలించి, సాంకేతిక విధానాలు, నిర్వహణ పద్ధతులు, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించనున్నారు. అదే సమయంలో గ్యాసిఫికేషన్ ఆధారంగా అమ్మోనియం నైట్రేట్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను కూడా సంస్థ పరిశీలిస్తోంది.
ఈ ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను వినియోగించుకునే అంశంపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టు సాంకేతికంగా విజయవంతం కావడానికి శాస్త్రీయ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర గనుల పరిశోధన సంస్థ సీఎస్‌ఐఆర్–సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల సాంకేతిక సహకారంతో ప్రాజెక్టు అమలు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ విజయవంతమైతే సింగరేణిలో ఇంధన ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు సంస్థ భవిష్యత్ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలిచే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.








