Mahaa Daily Exclusive

  తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట….. దాతల దర్శన విధానంలో మార్పులు…

Share

తిరుమల, మహా.
తిరుమలలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పిస్తున్న దర్శన సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ కొత్త డోనర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ విధానం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని టీటీడీ కార్యనిర్వహణాధికారి రవిచంద్ర తెలిపారు. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
కొత్త విధానం ప్రకారం రూ.10 లక్షలు విరాళంగా అందించిన దాతలకు ఇప్పటివరకు సంవత్సరానికి మూడుసార్లు కల్పిస్తున్న బ్రేక్ దర్శనాన్ని ఇకపై ఒక్కసారికే పరిమితం చేయనున్నారు. అదనంగా మరోసారి సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పించనున్నారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించిన దాతలకు జీవితకాలం అమలులో ఉన్న ప్రత్యేక సౌకర్యాలను ఇకపై 20 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు.
భక్తుల సౌకర్యాల విస్తరణకు పాలకమండలి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు పొందిన భక్తుల కోసం తిరుమలలో శాశ్వత నిరీక్షణ షెడ్లు, క్యూలైన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, కుమారధార–పసుపుధార డ్యామ్‌ల వద్ద డబుల్‌లేన్ వంతెన నిర్మాణం, గ్రీన్ ఎనర్జీ కోసం గాలిమర విద్యుత్ యంత్రం ఏర్పాటు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, అగ్నిమాపక వ్యవస్థల బలోపేతం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఒంటిమిట్ట ఆలయంలో విశ్రాంతి గృహ నిర్మాణం, లేపాక్షిలో కళ్యాణ మండపం నిర్మాణం, విజిలెన్స్ వ్యవస్థ బలోపేతానికి కొత్త పోస్టుల సృష్టి వంటి నిర్ణయాలకూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలతో తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాలు మరింత విస్తరించనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.