Mahaa Daily Exclusive

  గల్లీకో బెల్ట్ షాపు.. ఇంటికో బార్!

Share

  • మాస్టారి కనుసన్నల్లో మద్యం మాఫియా.
  • మామూళ్ల మత్తులో అబ్కారీ అధికారులు.
  • కూసుమంచిలో ‘కిక్కు’మంటున్న 412 బెల్ట్ షాపులు.
  • 24 గంటలూ మందు హోమ్ డెలివరీ.
  • పెరికసింగారం కేంద్రంగా కల్తీ మద్యం.. ప్రాణాలతో చెలగాటం.
  • వైన్ షాపుల్లో బెల్ట్ బాబులకు స్పెషల్ కౌంటర్లు.

ఖమ్మం, జూలై 19.

పాలేరు నియోజకవర్గంలో మద్యం మహమ్మారి పల్లెలను పట్టి పీడిస్తోంది. చట్టాలు, నిబంధనలు గాలికొదిలేసి, అబ్కారీ అధికారుల అండదండలతో మద్యం సిండికేట్ అడ్డగోలు దందాకు తెరలేపింది. గల్లీకో బెల్ట్ షాపు.. ఇంటికో బార్ అన్న చందంగా ముఖ్యంగా కూసుమంచి మండలంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం అమ్మకాలకు టార్గెట్లు పెట్టుకున్న వైన్ షాపుల యజమానులు, పల్లెల్లో బెల్ట్ షాపులను పుట్టగొడుగుల్లా పుట్టిస్తున్నారు. నివాస గృహాలు, చిన్న కిరాణా కొట్లు సైతం ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారాయి. కిలోమీటర్ల మేర ప్రయాణించి వైన్ షాపులకు వెళ్లే పనిలేకుండా, అడిగినంత సమర్పించుకుంటే చాలు ఏ బ్రాండ్ అయినా, అర్ధరాత్రి అయినా సరే ఇళ్ల ముంగిటే వాలిపోతోంది. ప్రభుత్వ ఆదాయం ముసుగులో వైన్ షాపుల నిర్వాహకులు ఆడుతున్న ఈ సిండికేట్ క్రీడలో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుండగా, ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.

కూసుమంచిలో వెల్లివిరుస్తున్న బెల్ట్ షాపుల సామ్రాజ్యం

పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మద్యం సిండికేట్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మండలంలో ఏకంగా 412 బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వైన్ షాపుల్లో దొరకని బ్రాండ్లు సైతం ఈ బెల్ట్ షాపుల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కో వైన్ షాపు పరిధిలో కనీసం 42 బెల్ట్ షాపులు అనుబంధంగా నడుస్తుండటం గమనార్హం. తమ అమ్మకాల టార్గెట్లు చేరుకోవడానికి వైన్ షాపుల నిర్వాహకులే స్వయంగా ఈ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారు. బెల్ట్ షాపుల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో, కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు తమ ఇళ్లనే బార్ అండ్ రెస్టారెంట్లుగా మార్చేశారు. ఏకంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేసి మరీ, చికెన్, మటన్, ఆమ్లెట్ వంటి వేడి వేడి మాంసాహార వంటకాలను వండి వడ్డిస్తూ మందుబాబులకు సకల మర్యాదలు చేస్తున్నారు.

బెల్ట్ బాబుల కోసం ఏకంగా స్పెషల్ కౌంటర్లు

చట్టప్రకారం ఒక వ్యక్తికి పరిమిత స్థాయిలోనే మద్యం విక్రయించాలి. కానీ కూసుమంచి మండలంలో ఈ చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులకు అక్రమంగా మద్యం సరఫరా చేసేందుకు వైన్ షాపుల్లో ఏకంగా స్పెషల్ కౌంటర్లు (ప్రత్యేక షెట్టర్లు) తెరిచారు. సాధారణ వినియోగదారులను పక్కనపెట్టి, బెల్ట్ షాపుల వారికి కార్టన్లకు కార్టన్లు అక్రమంగా కట్టబెడుతున్నారు. ఇందుకోసం వైన్ షాపుల నిర్వాహకులు ఒక్కో క్వార్టర్ బాటిల్ పై ఎమ్మార్పీ కంటే రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి మద్యాన్ని గ్రామాలకు తరలిస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకులు, వినియోగదారుల వద్ద నుంచి సీసాపై అదనంగా మరో రూ.40 నుంచి రూ.60 వరకు గుంజుతున్నారు. ఏ భయమూ వద్దు, అంతా మేము చూసుకుంటాం అంటూ వైన్ షాపుల యజమానులు ఇస్తున్న భరోసాతో గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.

రిటైర్డ్ మాస్టారి కనుసన్నల్లో కోట్లు కొల్లగొడుతున్న సిండికేట్

ఈ మొత్తం మద్యం మాఫియా వెనుక ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడి హస్తం ఉన్నట్లు బహిరంగ ప్రచారం జరుగుతోంది. సదరు మాస్టారు కనుసన్నల్లోనే సిండికేట్ నడుస్తోందని, ఆయన ఆజ్ఞ లేనిదే మండలంలో మద్యం చుక్క కూడా అమ్ముడవదని స్థానికులు కోడై కూస్తున్నారు. ఎవరైనా కొత్తగా బెల్ట్ షాపు పెట్టుకోవాలంటే కనీసం రూ.10 వేలు సిండికేట్ కు సమర్పించుకోవాలనే అప్రకటిత నిబంధన విధించారు. అబ్కారీ, రెవెన్యూ, పోలీసు శాఖలకు నెలనెలా ముడుపులు అందుతున్నాయని, తాము ఎంత రేటు నిర్ణయిస్తే అంతేనంటూ బెల్ట్ షాపుల నిర్వాహకుల వద్ద సిండికేట్ ప్రతినిధులు దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అన్ని శాఖల అధికారులను ఆ మాస్టారే స్వయంగా మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కల్తీ మద్యంతో ప్రాణాలకు ముప్పు

అధికారుల నిర్లిప్తత, సిండికేట్ కాసుల కక్కుర్తి వెరసి ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. పెరికసింగారం కేంద్రంగా భారీ ఎత్తున మద్యం కల్తీ జరుగుతున్నట్లు సమాచారం. ఖరీదైన మద్యం బాటిళ్లలో చౌకబారు మద్యాన్ని, రసాయనాలను కలిపి విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ మద్యం తాగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వైన్ షాపులు, బెల్ట్ షాపుల నుంచి అందుతున్న మామూళ్ల మత్తులో అబ్కారీ శాఖ అధికారులు ఏసీ గదుల్లో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాకేమీ తెలియదంటున్న అబ్కారీ అధికారులు

ఇంత జరుగుతున్నా, పల్లెల్లో మద్యం ఏరులై పారుతున్నా అబ్కారీ అధికారుల తీరు మాత్రం అంధుడికి అద్దం చూపించినట్లుగా ఉంది. కూసుమంచి మండలంలో బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న విషయం ఇప్పటివరకు తమ దృష్టికే రాలేదని ఎక్సైజ్ సీఐ నరేష్ వ్యాఖ్యానించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా మారింది. 412 బెల్ట్ షాపులు బహిరంగంగా బార్లను తలపిస్తూ వ్యాపారం చేస్తుంటే, ఫిర్యాదు చేస్తే కానీ చర్యలు తీసుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మామూళ్ల మత్తులో ఉన్న అధికారులపై కొరడా ఝుళిపించి, ఈ సిండికేట్ రాక్షస క్రీడకు ముగింపు పలకాలని నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.