- త్రిపురలో కలకలం
- గన్‌తో కాల్చుకుని డీజీపీ అనురాగ్ ధన్కడ్ ఆత్మహత్య
- సమర్థుడైన అధికారిగా గుర్తింపు
- ఆత్మహత్యనా, హత్యనా అన్న కోణంలో దర్యాప్తు
అగర్తల, మహా : ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యున్నత పోలీస్ వ్యవస్థను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. త్రిపుర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న 1994 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధంకర్ సోమవారం మధ్యాహ్నం అగర్తలాలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో తన ఛాంబర్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆయన తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే భద్రతా బలగాలు, ఉన్నతాధికారులు హెడ్‌క్వార్టర్స్‌కు పరుగులు తీశారు.
పోలీస్ కార్యాలయంలో రక్తసిక్తమైన స్థితిలో ఉన్న ధంకర్‌ను వెంటనే తీవ్ర గాయాలతో అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆయనలో ప్రాణం లేదని వైద్యులు ధృవీకరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఆయనను అత్యవసర విభాగానికి తీసుకువచ్చారని, పల్స్, బీపీ ఏమీ లేకపోవడంతో సుమారు 40 నిమిషాల పాటు సీపీఆర్ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, మధ్యాహ్నం 12:48 గంటలకు ఆయన మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించామని డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వెల్లడించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
మచ్చలేని అధికారి
మచ్చలేని సుదీర్ఘ కెరీర్ ఉన్న ఒక అత్యున్నత స్థాయి అధికారి హెడ్‌క్వార్టర్స్‌లోనే తన ప్రాణాలు తీసుకునేంత తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఘటన స్థలాన్ని సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా వృత్తిపరమైన ఒత్తిళ్లు ఏమైనా కారణమయ్యాయా అనే అంశాలపై ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. సీఎం మాణిక్ సాహా, ఇతర ప్రభుత్వ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆసుపత్రికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనురాగ్ ధంకర్ 1994 బ్యాచ్ త్రిపుర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా దేశ రాజకీయ, దర్యాప్తు వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. మే 2025లో అమితాభ్ రంజన్ స్థానంలో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆయన త్రిపురలోనే డీజీపీ ఇంటెలిజెన్స్) గా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా తన కెరీర్లో కేంద్ర దర్యాప్తు సంస్థలో సుదీర్ఘకాలం పనిచేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్థిక కుంభకోణంలో నీరవ్ మోదీ కేసుతో పాటు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల దర్యాప్తుకు సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి కూడా నాయకత్వం వహించిన గొప్ప అనుభవం ఆయనకుంది.
అత్యంత సమర్థుడైన ఐపీఎస్ ఆఫీసర్‌గా, క్లిష్టమైన కేసులను ఛేదించిన నిపుణుడిగా పేరున్న అనురాగ్ ధంకర్ హఠాన్మరణం త్రిపుర పోలీస్ వర్గాలను, కేంద్ర హోం మంత్రిత్వ శాఖను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దశాబ్దాల కాలం పాటు చట్టం, భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన ఒక డీజీపీ స్థాయి ఆఫీసర్ ఇలా ఆత్మహత్యకు పాల్పడటం భారతీయ పోలీస్ వ్యవస్థల్లో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలపై సరికొత్త చర్చకు దారితీస్తోంది. దర్యాప్తు నివేదికల అనంతరం మాత్రమే ఈ దారుణ ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.








