ఢిల్లీ, మహా.
నీట్–యూజీ 2026తో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధులు సోమవారం కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా సుమారు పది నిమిషాల పాటు జేపీ నడ్డాతో సమావేశమై పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా తమ వినతిపత్రాన్ని పరిశీలించి, ప్రభుత్వంలోని సంబంధిత స్థాయిలో చర్చిస్తానని నడ్డా హామీ ఇచ్చారని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదా హామీ రాలేదని పేర్కొన్నారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
జేపీ నడ్డాకు సమర్పించిన లేఖలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై సీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. నీట్–యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలు, పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలకు మంత్రి నైతిక బాధ్యత వహించాలని పేర్కొంది. అలాగే సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల పోర్టల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, సీయూఈటీ పరీక్షల నిర్వహణలో జరిగిన జాప్యాలు కూడా విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు నిదర్శనమని ఆరోపించింది.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ప్రవేశ పరీక్షల నిర్వహణలో పటిష్ఠమైన సంస్కరణలు తీసుకురావడంలో కేంద్ర విద్యాశాఖ విఫలమైందని సీజేపీ ఆరోపించింది. పరీక్షల భద్రతను బలోపేతం చేయడం, సాంకేతిక లోపాలను నివారించడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ తన వినతిపత్రంలో కోరింది.








