Mahaa Daily Exclusive

  దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్….

Share

దేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్.
* ‘క్యూడెంగా’కు డీసీజీఐ అనుమతి.
* 4 నుంచి 60 ఏళ్ల వారికి అందుబాటు.
ఢిల్లీ, మహా.
భారత్‌లో డెంగ్యూ నియంత్రణకు కీలక ముందడుగు పడింది. దేశంలో తొలి డెంగ్యూ నివారణ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ విడుదలకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. జపాన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ తకేడా అభివృద్ధి చేసిన ఈ టీకా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో వినియోగానికి ఆమోదం పొందింది. భారత్‌లో ప్రతి ఏడాది లక్షలాది మంది డెంగ్యూ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ప్రజారోగ్య రంగంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

తకేడా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఎలాంటి ముందస్తు రక్తపరీక్షలు చేయించాల్సిన అవసరం లేకుండానే టీకా వేయించుకోవచ్చని పేర్కొంది. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా, ఒక్కోసారి 0.5 మిల్లీలీటర్ల చొప్పున ఈ వ్యాక్సిన్ అందిస్తారు.

డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే నాలుగు రకాల వైరస్ సీరోటైప్ల నుంచి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా ఈ టీకాను సిఫార్సు చేసింది. ఏడు సంవత్సరాల క్లినికల్ అధ్యయనాల ప్రకారం, రెండు డోసులు పూర్తయిన తర్వాత డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన ప్రమాదాన్ని 84.1 శాతం వరకు తగ్గించినట్లు వెల్లడైంది. తీవ్రమైన డెంగ్యూ కేసులను తగ్గించడంలో కూడా ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో తేలింది.

భారత్‌లో ఈ వ్యాక్సిన్ ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే దేశీయంగా భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టేందుకు తకేడా సంస్థ హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏడాదికి సుమారు 5 కోట్ల డోసులు తయారు చేసే లక్ష్యంతో ఉత్పత్తి చేపట్టనున్నట్లు సమాచారం. స్థానిక తయారీ ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు వ్యాక్సిన్ ధర కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మొదట ఈ టీకాను ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తారా, లేక ప్రభుత్వ టీకా కార్యక్రమంలో చేర్చుతారా అన్న అంశంపై కూడా ధర ఆధారపడి ఉండనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే డెంగ్యూ కేసుల్లో గణనీయమైన వాటా భారత్‌లోనే నమోదవుతోంది. 2025లో దేశంలో అధికారికంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే గుర్తించబడని కేసులు ఇంకా అధికంగానే ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగ్యూ నివారణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా మారనుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డెంగ్యూ వైరస్ ప్రధానంగా ఏడిస్ ఈజిప్టై (టైగర్) దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ సాధారణంగా పగటి వేళల్లో కుడుతుంది. డెంగ్యూ సోకిన వ్యక్తికి అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, కంటి వెనుక భాగంలో నొప్పి, తీవ్రమైన నీరసం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గి పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. ఒకసారి డెంగ్యూ వచ్చిన వ్యక్తికి మళ్లీ వేరే సీరోటైప్ వైరస్ సోకితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దోమల నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమతెరలు, రిపెలెంట్లు ఉపయోగించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు కొనసాగించాలని పేర్కొంటున్నారు. డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ఆరోగ్య రక్షణకు ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.