Mahaa Daily Exclusive

  దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం….

Share

దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభం.
• రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ విస్తరణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి.

ఖమ్మం, మహా.
వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గోద్రెజ్ సంస్థ ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ నాదిర్ బి. గోద్రెజ్, గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ సునీల్ కటారియా, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఫ్యాక్టరీలోని ఉత్పత్తి విభాగాలు, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ యూనిట్లు, నాణ్యత నియంత్రణ వ్యవస్థను పరిశీలించిన అనంతరం జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యవసాయానికి చిరునామాగా నిలిచిందన్నారు. పాలేరు జలాశయం, నాగార్జునసాగర్ ఎడమ కాలువ, వైరా రిజర్వాయర్ ఈ ప్రాంత రైతులకు జీవనాధారమని పేర్కొన్నారు. సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం అందించే ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగును రైతులు విస్తరించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు నాలుగేళ్ల కాలంలో ఎకరాకు సుమారు రూ.52 వేల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. సూపర్ ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆయిల్ పామ్ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని చెప్పారు. దేశంలో వంటనూనెల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తి పెంచేందుకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ అత్యవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం వంటనూనెల దిగుమతుల కోసం ప్రతి సంవత్సరం సుమారు రూ.1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం వెచ్చిస్తున్నామని గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 15 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దేశ అవసరాలకు అనుగుణంగా దీన్ని 70 లక్షల ఎకరాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని భట్టి చెప్పారు. 2023లో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.12 వేలుగా ఉండగా ప్రస్తుతం రూ.23 వేల వరకు పెరగడం రైతులకు లాభదాయకంగా మారిందన్నారు. వంటనూనెతో పాటు సౌందర్య సాధనాల తయారీకి కూడా ఆయిల్ పామ్ ముడి పదార్థంగా ఉపయోగపడుతుందని వివరించారు.

ఖమ్మం జిల్లాలో ఏర్పాటైన ఈ సమీకృత పరిశ్రమ రైతులకు, యువతకు వరంగా మారుతుందని పేర్కొన్న భట్టి, పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. పరిశ్రమకు అవసరమైన రహదారి మౌలిక వసతులను టీజీఐఐసీ ద్వారా త్వరలో కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మంలో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి మిర్చి, పత్తి, వరి వంటి పంటలకు విలువ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని గోద్రెజ్ సంస్థను కోరారు.

113 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సమీకృత కాంప్లెక్స్‌లో సీడ్ గార్డెన్, మిల్లింగ్ యూనిట్, రిఫైనరీ, నాణ్యత పరీక్షా కేంద్రం వంటి అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు కావడం విశేషమని భట్టి పేర్కొన్నారు. గంటకు 60 నుంచి 120 టన్నుల ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ పరిశ్రమకు ఉందన్నారు. భవిష్యత్తులో ఆయిల్ పామ్ విత్తనాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఖమ్మమే దేశానికి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి రూ.17 లక్షల కోట్లకు చేరుకున్నప్పటికీ వ్యవసాయ రంగం వాటా కేవలం 15 శాతం మాత్రమే ఉందని, రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, వాణిజ్య పంటలే శాశ్వత పరిష్కారమని తెలిపారు. ఇటీవల తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సాయం జమ చేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్, సీతారామ ఎత్తిపోతల పథకం, పాలేరు లింక్, ఎన్‌కూర్–రాజీవ్ లింక్ కాలువల ద్వారా లభించే నీటిని వినియోగించి ఉద్యాన పంటల సాగును మరింత విస్తరించాలని సూచించారు. కొణిజెర్లను రాష్ట్రంలోనే ప్రముఖ పారిశ్రామిక మండలంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో దీన్ని 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ప్రతి 10 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగుకు ఒక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా గోద్రెజ్ ఏర్పాటు చేసినది నాలుగో ఫ్యాక్టరీ అని చెప్పారు. త్వరలో మరో ఆరు ఫ్యాక్టరీలను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

దేశంలోనే తొలి ఆధునిక ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ ఖమ్మంలో ఏర్పాటవుతోందని తుమ్మల తెలిపారు. పరిశోధన కేంద్రం, శిక్షణా కేంద్రం, ప్రదర్శన విభాగాలు, నాణ్యమైన నర్సరీలు, రైతులకు అవసరమైన సాంకేతిక సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే ఎకరాకు 15 నుంచి 16 టన్నుల వరకు గెలల దిగుబడి సాధ్యమవుతుందని వివరించారు. ఆయిల్ పామ్ తోటల్లో కంది, పత్తి, పప్పుధాన్యాలు వంటి అంతర పంటలు సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ కనీస మద్దతు ధరను పెంచాలని, దిగుమతులపై సుంకాలు విధించాలని రాష్ట్రం కోరుతోందన్నారు.

వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా ప్రస్తుతం 40 బిలియన్ డాలర్లుగా ఉన్న వ్యవసాయ రంగ ఆర్థిక విలువను 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమన్నారు. గత మూడు సంవత్సరాల్లోనే రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలకు పైగా కొత్తగా ఆయిల్ పామ్ సాగులోకి రావడం దేశంలోనే అత్యధికమని చెప్పారు.

గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్ నాదిర్ బి. గోద్రెజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశం వంటనూనెల్లో స్వయం సమృద్ధి సాధించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆయిల్ పామ్ సాగులో మహిళలు మరింత చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ సునీల్ కటారియా మాట్లాడుతూ ఖమ్మంలో ఏర్పాటైన సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇదే ప్రాంగణంలో త్వరలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నాణ్యమైన మొక్కల ఉత్పత్తి కోసం ఆధునిక సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసి రైతులకు మెరుగైన నాట్లు అందించనున్నట్లు చెప్పారు.

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు కోరుకున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కల నేడు సాకారమైందన్నారు. ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీలో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని గోద్రెజ్ యాజమాన్యాన్ని కోరారు.

దేశంలోనే తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ప్రారంభంతో ఖమ్మం జిల్లా ఆయిల్ పామ్ రంగానికి జాతీయ కేంద్రంగా ఎదిగే దిశగా మరో కీలక అడుగు పడిందని ప్రభుత్వం, గోద్రెజ్ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.