- ఎక్కడా నీటి ఇబ్బందులు ఉండొద్దు.
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనితీరుపై శనివారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆమె, సింగూరు, పాలేరు జలాశయాల నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రోజువారీగా రిజర్వాయర్ల నీటిమట్టాలను సమీక్షించాలని, స్థానిక నీటి వనరులను వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. బోర్వెల్స్ వద్ద రీఛార్జింగ్ పిట్స్, రైన్వాటర్ హార్వెస్టింగ్ పనులను వేగవంతం చేయాలని, గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నీటి సరఫరాపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, సర్పంచ్లు, వార్డు సభ్యులతో సమన్వయం పెంచి నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ఎల్నినో పరిస్థితులు నెలకొన్నాయని, దాని ప్రభావం తెలంగాణపైనా ఉందని పేర్కొన్న మంత్రి, మిషన్ భగీరథ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తామని, నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
16వ ఆర్థిక సంఘం నిధులను తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉందని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం తాగునీటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే ఆర్థిక సంఘం నిధులతో ప్రత్యామ్నాయంగా మంచినీటి సరఫరా చేపట్టాలని ఆదేశించారు. పైప్లైన్ లీకేజీలు లేదా మరమ్మతుల కారణంగా నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి వస్తే ప్రజలకు ముందుగానే సమాచారం అందించాలని సూచించారు.
2023లో కూడా ఇలాంటి ఎల్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చేశామని గుర్తు చేసిన మంత్రి, ఈసారి కూడా అదే స్థాయిలో పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న గ్రామాల్లో వారం రోజుల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయాలని, మిషన్ భగీరథతో అనుసంధానం కాని ఆదివాసీ, గిరిజన గ్రామాలను ఏఈలు సందర్శించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే మండలాల వారీగా సర్పంచ్లతో సమావేశాలు నిర్వహించి తాగునీటి సరఫరాపై క్రమం తప్పకుండా సమీక్షించాలని మంత్రి సీతక్క సూచించారు.







