Mahaa Daily Exclusive

  పేపర్ లీక్‌లపై మరింత ఉక్కుపాదం. లోక్‌సభలో నేడు సవరణ బిల్లు.

Share

ఢిల్లీ, మహా.

దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ‘పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026’ ముసాయిదాను శనివారం విడుదల చేసింది. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడం, వ్యవస్థీకృత ముఠాల అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ బిల్లును ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

సవరణ బిల్లు ప్రకారం పరీక్షల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడిన వారికి ప్రస్తుతం ఉన్న శిక్షలను మరింత కఠినతరం చేశారు. ఇలాంటి నేరాలకు ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలపై గరిష్ఠంగా రూ.10 కోట్ల జరిమానా విధించే నిబంధనను చేర్చారు.

పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు లేదా సేవలందించే సంస్థలు అక్రమాలకు పాల్పడితే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, సంబంధిత సంస్థలను ఎనిమిదేళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో ఉంచేలా బిల్లులో ప్రతిపాదించారు. పరీక్షల నిర్వహణలో బాధ్యతను మరింత పెంచేలా ఈ నిబంధనలు రూపొందించారు.

అక్రమాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయడంపై కూడా బిల్లు ప్రత్యేక దృష్టి సారించింది. కేసు నమోదైన రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయడం తప్పనిసరి కాగా, ఇందుకోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల్లోపు విచారణ పూర్తిచేసి తుది తీర్పు వెలువరించాలని బిల్లులో పేర్కొన్నారు.

తీర్పులపై దాఖలయ్యే అప్పీళ్లను హైకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మాత్రమే విచారించేలా ప్రతిపాదించారు. అప్పీల్ విచారణను కూడా మూడు నెలల్లోపు పూర్తిచేయాలని స్పష్టమైన గడువును నిర్ణయించారు. పరీక్షలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం, యువత భవిష్యత్తును రక్షించడం లక్ష్యంగా ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.