• కుటుంబాల్లో సంభాషణలు పెరగాలి.
• ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఢిల్లీ, మహా.
కొత్తతరం ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తోందని, వారి సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ అన్నారు. కుటుంబాల్లో పరస్పర సంభాషణలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వారి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
ఢిల్లీలో నిర్వహించిన ‘విశ్వ మాంగల్య సభ’ జాతీయ ప్రబోధన సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, యువత ఆలోచనా విధానం, కుటుంబ వ్యవస్థలో వస్తున్న పరిణామాలపై ఆయన విస్తృతంగా ప్రస్తావించారు. నేటి కాలంలో సమాచారం మొత్తం మొబైల్ ఫోన్లలోనే అందుబాటులో ఉండటంతో యువత ప్రతి విషయాన్నీ విశ్లేషించి ప్రశ్నిస్తోందని చెప్పారు.
పిల్లలకు కేవలం ఆదేశాలు ఇవ్వడం కాకుండా వాటి వెనుక ఉన్న కారణాలను కూడా వివరించాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం తగ్గిపోవడం ఆందోళనకరమని, ఆప్యాయతతో కూడిన సంభాషణల ద్వారా కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విదేశీ దండయాత్రలు, బ్రిటీష్ పాలన ప్రభావంతో భారతీయుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. మన సంప్రదాయాలపై అపోహలు పెరిగి, విదేశీ విధానాలే శ్రేష్ఠమనే భావన ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి భయపడాల్సిన అవసరం లేదని, దానిని మానవాళి శ్రేయస్సు కోసం వినియోగించాలని ఆయన సూచించారు. అపరిమిత కోరికలు, భౌతికవాదం సమాజంలో పోటీ, సంఘర్షణలను పెంచుతాయని హెచ్చరిస్తూ, విలువల ఆధారిత జీవన విధానమే సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని మోహన్ భగవత్ పేర్కొన్నారు.







