• జులై 31 నుంచి మళ్లీ నమోదు అవకాశం.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4,16,27,694గా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను శనివారం అధికారికంగా ప్రకటించారు. అర్హులైన వారు తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
సీఈఓ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో అత్యధికంగా 44,89,488 మంది ఓటర్ల చిరునామాలు సరిగా లేనట్లు గుర్తించారు. అలాగే 15,22,174 మంది ఓటర్లు మరణించినట్లు నిర్ధారణ కాగా, 14,43,886 మంది ఇతర ప్రాంతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఓటరుగా నమోదైన వారి సంఖ్య 7,37,216గా నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా 7,77,885 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని వివేక్ యాదవ్ తెలిపారు. ఇతర కేటగిరీల కింద మరో 8,327 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు.
అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోయిన వారు లేదా తొలగించబడిన వారు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుని తిరిగి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని సీఈఓ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.







