Mahaa Daily Exclusive

  ధర్మేంద్ర రాజీనామా దురదృష్టకరం….

Share

ధర్మేంద్ర రాజీనామా దురదృష్టకరం.

* విదేశీ కుట్రల ఫలితమే: రాజా సింగ్.

 

హైదరాబాద్, మహా.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దురదృష్టకర పరిణామమని, ఇది విదేశీ శక్తుల ఒత్తిడి, కుట్రల ఫలితమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. దేశానికి తప్పుడు సంకేతాలు పంపే ఈ పరిణామంపై ప్రతి భారతీయుడు ఆలోచించాలని సూచించారు.

 

వీడియో సందేశం ద్వారా స్పందించిన రాజా సింగ్ మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో పలు కీలక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.

 

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఒక మంత్రి పరిధిలో అనేక మంది అధికారులు పనిచేస్తారని రాజా సింగ్ అన్నారు. కిందిస్థాయి అధికారుల తప్పిదాలకు నేరుగా మంత్రిని లేదా ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని, దోషులను అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించే చర్యలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు.

 

నేపాల్ తరహా ఆందోళనల ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో విదేశీ శక్తుల మద్దతుతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రతిపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులు, యువత నిరసనల వెనుక ఉన్న రాజకీయ, విదేశీ కుట్రలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

 

ధర్మేంద్ర ప్రధాన్ యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజీనామా చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలకు దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని, విద్యారంగానికి అందించిన సేవలను దేశం గుర్తుంచుకుంటుందని అన్నారు.