• 24 గంటల్లో 303 మిలియన్ వ్యూస్.
ఢిల్లీ, మహా.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ‘జెన్-జీ’ శైలిలోని సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదలైన ఈ వీడియో తొలి 24 గంటల్లోనే 303 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా నిలిచింది. ఈ వీడియోతో ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరినట్లు వెల్లడైంది.
నీట్-2026 ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ అర్థరాత్రి ఈ వీడియోను విడుదల చేశారు. యువత ఎక్కువగా ఉపయోగించే ‘జెన్-జీ’ శైలిలో ‘ఫ్రెండ్స్’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేపర్ లీక్‌లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, ప్రపంచ నాయకుల్లో అత్యధిక ఇన్స్టాగ్రామ్ అనుచరులు కలిగిన నేతగా కొనసాగుతున్నారు. ఈ సెల్ఫీ వీడియోకు వచ్చిన అపూర్వ స్పందనతో గతంలో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో రికార్డు కూడా బద్దలైనట్లు పేర్కొంటున్నారు. వీడియోలో మోదీ వినియోగించిన జెన్-జీ శైలి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
తదుపరి విడుదల చేసిన మరో వీడియోలో యువతకు ప్రధాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘థాంక్యూ ఫ్రెండ్స్’ అంటూ ప్రారంభించిన సందేశంలో సోషల్ మీడియా ద్వారా వచ్చిన సూచనలు, స్పందనలు ప్రభుత్వం–ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. తొలి వీడియోకు 16 మిలియన్లకు పైగా లైక్‌లు, సుమారు 15 లక్షల కామెంట్లు రావడంతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత విస్తృతంగా స్పందించినట్లు సమాచారం.






