• 480 సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్.
ఢిల్లీ, మహా.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన 480 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
సీనియర్ పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతూ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన వీడియోలు, డీప్‌ఫేక్‌లు, ఎడిట్ చేసిన క్లిప్పింగ్‌లు, నకిలీ పోస్టుల ద్వారా ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం సాగుతోందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు, పోస్టుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు, ఇతరులతో పంచుకునే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జంతర్ మంతర్ వద్ద నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న విపక్ష నేతల ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రతి పౌరుడి హక్కును గౌరవిస్తామని, అయితే తప్పుడు ప్రచారం, డీప్‌ఫేక్‌ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.






