Mahaa Daily Exclusive

  ప్రజాసేవే రాజకీయాల పరమావధి.

Share

• యువత ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం బలోపేతం: హరీశ్‌రావు

హైదరాబాద్, మహా.

పదవులు శాశ్వతం కావని, ప్రజలకు సేవ చేయడమే రాజకీయాల అంతిమ లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. 99టీవీ నిర్వహించిన ‘స్టేట్స్‌మ్యాన్ ఎక్సలెన్స్ అవార్డ్స్–కాంక్లేవ్’లో పాల్గొన్న ఆయన, పాలిటిక్స్ బియాండ్ పవర్ అంశంపై ప్రసంగిస్తూ యువత బాధ్యతాయుత నాయకత్వంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడం, అధికారంలోకి రావడం మాత్రమే కాదని, రైతుకు నీరు, విద్యార్థికి విద్య, యువతకు ఉపాధి, ప్రజలకు మెరుగైన వైద్యం, మౌలిక సదుపాయాలు అందించడమే నిజమైన రాజకీయమని హరీశ్‌రావు పేర్కొన్నారు. అధికారం ప్రజాసేవకు ఒక సాధనం మాత్రమేనని, సేవే నాయకుడి అసలు లక్ష్యంగా ఉండాలన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్ర సాధన అసాధ్యమని భావించిన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరదృష్టి, అకుంఠిత దీక్షతో ఉద్యమానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఆయన నాయకత్వంలో యువత, విద్యార్థులు తమ వ్యక్తిగత భవిష్యత్తును పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొనడం వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. ప్రజల్లో స్ఫూర్తిని నింపగల నాయకత్వానికి కేసీఆర్ నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చని, దేవాదుల ప్రాజెక్టు పంపులను ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమాల ప్రభావంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ, ప్రశ్నించే యువత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారం అందించగలదే తప్ప సామాజిక సమస్యలకు మానవీయ పరిష్కారాలు చూపలేదని హరీశ్‌రావు అన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యే నాయకత్వానికి కొలమానం కాదని, వ్యక్తిత్వం, విలువలు, సేవాభావమే నాయకుడి అసలు బలం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయంలోని ప్రతి ఫైలు వెనుక ఒక కుటుంబం, ఒక మనిషి జీవితం ఉంటుందనే స్పృహ ప్రజాప్రతినిధులకు ఉండాలని సూచించారు. దేశ నిర్మాణంలో యువత ప్రేక్షకులుగా కాకుండా బాధ్యతగల పౌరులుగా భాగస్వాములు కావాలని, స్వార్థరహిత సేవే నిజమైన రాజకీయమని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.