Mahaa Daily Exclusive

  తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు….

Share

తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్లు.
* రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్.
* కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సిద్ధిపేట, మహా.

దేశంలో ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లలో మూడు తెలంగాణకు రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరగనున్నాయని, తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఇవి గేమ్‌చేంజర్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన భవిష్యత్ రైల్వే ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేశారు.

కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ స్టేషన్ నిర్మాణం భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రెండేళ్లలో స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తులకు అంకితం చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. హైదరాబాద్ నుంచి కేవలం రూ.20 టికెట్‌తో కొమురవెల్లికి చేరుకునే అవకాశం కల్పించామని తెలిపారు.

ప్రస్తుతం ఈ మార్గంలో డీజిల్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే రూ.300 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మార్గాన్ని విద్యుద్దీకరిస్తామని వెల్లడించారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు షటిల్ బస్సు సర్వీసులు నడిపే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సూచించారు. పండుగలు, జాతరల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతామని తెలిపారు.

తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా సిరిసిల్లకు రైలు సేవలను ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది వేములవాడ వరకు, 2029 నాటికి కొత్తపల్లి వరకు రైల్వే లైన్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే హైదరాబాద్–యాదాద్రి మధ్య రూ.500 కోట్లతో ఎంఎంటీఎస్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కోరారు.

పాండురంగాపురం–భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించిన ఆయన, తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందించామని గుర్తు చేశారు. కాజీపేటలో నిర్మాణంలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వచ్చే ఏడాది ప్రారంభిస్తామని తెలిపారు.

ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్) ప్రాజెక్టుకు సంబంధించి కూడా త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెబుతారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రవాణా, మౌలిక వసతులు, రైల్వే రంగంలో చేపడుతున్న భారీ పెట్టుబడులు ఆ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.