Mahaa Daily Exclusive

  యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం….

Share

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
* దోషులకు 10 ఏళ్ల జైలు.. రూ.10 కోట్ల వరకు జరిమానా.

ఢిల్లీ, మహా.

దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలను కట్టడి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. బిల్లులో మార్పులు చేయాలని విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షించడం, పరీక్షల విశ్వసనీయతను బలోపేతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కొత్త చట్టం ప్రకారం ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలు, మోసాలకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలిన వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం కల్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా మాత్రమే ఉండగా, కొత్త బిల్లుతో శిక్షలను గణనీయంగా కఠినతరం చేశారు. వ్యవస్థీకృతంగా జరిగే పేపర్ లీక్ నేరాల విషయంలో కూడా కఠిన చర్యలకు అవకాశం కల్పించారు.

ఇటీవలి కాలంలో దేశంలోని పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు వెలుగులోకి రావడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం అమలులోకి వస్తే పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం పెరగడంతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపై మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకునే వీలుంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

బిల్లు ఆమోదం అనంతరం లోక్‌సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా గురువారానికి వాయిదా వేశారు.