Mahaa Daily Exclusive

  రైతులు–విద్యార్థుల ఉమ్మడి పోరాటానికి సన్నాహాలు

Share

రైతులు–విద్యార్థుల ఉమ్మడి పోరాటానికి సన్నాహాలు
* రాకేశ్ టికాయత్‌తో సీజేపీ నేతల భేటీ.. సంయుక్త వేదిక ఏర్పాటుపై చర్చ.
ఢిల్లీ, మహా.
రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఉమ్మడి ఉద్యమం చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. ఈ దిశగా రైతు సంఘాలతో చర్చలు ప్రారంభించిన పార్టీ ప్రతినిధులు, భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సీజేపీ ప్రతినిధి అశుతోష్‌తో పాటు పలువురు విద్యార్థి నేతలు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ నాయకుడు రాకేశ్ టికాయత్‌ను మంగళవారం కలిశారు. ఈ సమావేశంలో రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంయుక్త ఉద్యమానికి రూపకల్పన చేయడం, ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం అశుతోష్ మాట్లాడుతూ.. దేశంలో రైతులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సంయుక్తంగా పోరాటం నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి ప్రశ్నించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే, ఇటీవల విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ ప్రతినిధులు రాకేశ్ టికాయత్‌ను కోరారు. రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలతో కలిసి విస్తృత స్థాయి పోరాటానికి కార్యాచరణ రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.