- పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్
- కీలక ప్రాజెక్టుల పనులకు మార్గం సుగమం
- తీర్పుతో జోరందుకోనున్న ప్రాజక్టుల నిర్మాణం
- దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ, మహా : ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు సుప్రీంకోర్టులో అత్యంత భారీ ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద పర్యావరణ అనుమతుల అమలుకు అడ్డంకులు తొలగిపోవడంతో, రాష్ట్రంలో వేలాది ఎకరాలకు సాగునీరు మరియు కోట్లాది మందికి తాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టుల నిర్మాణ పనులకు దారి సుగమమైంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2021 నాటి కేంద్ర పర్యావరణ శాఖ కార్యనిర్వాహక మెమోరాండంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, గతంలో ఆ మెమోరాండం ఆధారంగా మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ పూర్తిగా చెల్లుబాటులో ఉంటాయని ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ కీలక నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వ డ్రీమ్ ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి నిర్మాణాలు పూర్తి చట్టబద్ధమైన రక్షణను పొందినట్లయింది. న్యాయస్థానాల ఆదేశాల కారణంగా ఇన్నాళ్లూ పనుల్లో అడ్డంకులు ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు కొత్త ఊపిరి పోశాయి. ఈ తీర్పు కేవలం భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న కీలక ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ముప్పు లేదని తేల్చిచెప్పడంతో, రాష్ట్రవ్యాప్తంగా పనులు నిలిచిపోయిన రిజర్వాయర్లు, కెనాళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కానుంది.
ఆఫీస్ మెమోరాండమ్‌లతో ఆపలేరు
తీర్పు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, చట్టాల అమలుపై సీజేఐ ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆఫీస్ మెమోరాండమ్‌లు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను రూపుమాపడం లేదా భర్తీ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ముందస్తు పర్యావరణ అనుమతులు లేని ఏ నూతన ప్రాజెక్టుకూ పర్యావరణ రక్షణ చట్టాలకు విరుద్ధంగా మినహాయింపులు లేదా అనుమతులు మంజూరు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.







