- నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్
- ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ
- రూ.లక్ష పూచీకత్తు సమర్పించిన కేటీఆర్
- విచారణ ఆగస్టు 25 కు వాయిదా
హైదరాబాద్, మహా : ఫార్ములా-ఈ కార్ రేసింగ్ నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ-కేసు విచారణను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఈ కేసులో ఏ 1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ తోపాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఏ-2, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏ-3 లు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రూ.లక్ష పూచీకత్తు కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి సమర్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ నిధుల నుంచి దాదాపు రూ.55 కోట్లను ఆర్బీఐ, కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారనే కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లైంది.
కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌లతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కోర్టు ఆవరణకు తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో హెచ్‌ఎమ్‌డీఏ నిధులను అక్రమంగా వాడారని ఏసీబీ ప్రధానంగా అభియోగం మోపింది. ఫార్ములా-ఈ రేస్, రేసింగ్ ట్రాక్ నిర్మాణం, ఇతర అనుబంధ ఏర్పాట్ల పేరిట హెచ్‌ఎమ్‌డీఏ ఖజానా నుంచి రూ.55 కోట్లకు పైగా నిధులను వెచ్చించారని తెలిపింది. ఎలాంటి అధికారిక రికార్డులు పాటించకుండా ఈ ఖర్చులు చేయడం ద్వారా ఆడిట్ తనిఖీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఏసీబీ పేర్కొంది. మూడు సీజన్లకు వర్తించే వ్యయాన్ని ఒకే ఒక్క రేసుకు చేసిన ఖర్చుగా చూపించి.. రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తీసుకోకుండా నిబంధనలను పక్కనబెట్టారని పేర్కొంది.






